
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ తన ప్రస్థానాన్ని 85 పతకాలతో ముగించింది. చివరి రోజున భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించడంతో దేశం ఖాతాలో 21వ గోల్డ్ మెడల్ చేరింది. దీంతో భారత్.. ఉజ్బెకిస్థాన్‌తో సమానంగా 21 స్వర్ణాలు సాధించినప్పటికీ, 27 రజత పతకాల కారణంగా పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
రెండో అత్యుత్తమ ప్రదర్శన
ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలు సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారతదేశానికి ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 2023లో జరిగిన క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 106 పతకాలు సాధించింది.
పతకాల పట్టికలో నాలుగో స్థానంలో భారత్ నిలవడం కూడా ఇది మూడోసారి. గతంలో 1951, 1962లో భారత్ నాలుగో స్థానంలో నిలవగా.. తాజాగా 2026లో మరోసారి అదే స్థానాన్ని అందుకుంది.
మహిళలు, పురుషుల నుంచి సమాన పతకాలు
ఈసారి భారత అథ్లెట్ల ప్రదర్శనలో మరో ప్రత్యేకత కనిపించింది. మహిళలు, పురుషులు చెరో 38 పతకాలు సాధించగా.. మిక్స్డ్ ఈవెంట్ల ద్వారా మరో 9 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.
టీమ్ ఈవెంట్లలోనూ భారత జట్లు సత్తా చాటాయి. హాకీ, కబడ్డీ, క్రికెట్లో పురుషులు, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించి డబుల్ గోల్డ్‌తో మెరిశాయి. అథ్లెటిక్స్ నుంచి అత్యధికంగా 24 పతకాలు రాగా.. షూటింగ్లో 15 పతకాలు భారత్‌కు లభించాయి. ఆర్చరీలో ఐదు స్వర్ణాలు, బాక్సింగ్‌లో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
ముగ్గురు అథ్లెట్ల ఖాతాలో మూడు పతకాలు
వ్యక్తిగత విభాగాల్లోనూ భారత క్రీడాకారులు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఆర్చరీలో కుంకుమ్ మోహోడ్ రెండు స్వర్ణాలు, ఒక రజతంతో మూడు పతకాలు సాధించారు. షూటింగ్లో నీరు ధాండా కూడా రెండు గోల్డ్స్, ఒక సిల్వర్‌తో మూడు మెడల్స్ తన ఖాతాలో వేసుకున్నారు.
వీథ్య రామ్రాజ్, గుల్వీర్ సింగ్, రుద్రాంక్ష్ పాటిల్ కూడా తలా మూడు పతకాలు సాధించి భారత పతకాల సంఖ్య పెంచడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా 85 పతకాలతో ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ తన సత్తాను చాటింది.
