
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆందోళనకు దిగింది. శనివారం జరిగిన నిరసనల్లో పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ.. వెనక్కి తగ్గేది లేదని CJP నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.
సీఈసీ రాజీనామా చేసే వరకు పోరాటం
ఓటర్ల జాబితాల సవరణలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ పదవికి రాజీనామా చేయాలని CJP నేత అజింక్య షిండే డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. శనివారం పోలీసుల చర్యలు తమ ఉద్యమాన్ని ఆపలేవని, ఆదివారం కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు.
అరెస్టులతో ఉద్రిక్తత
అక్టోబర్ 10న CJP ఇచ్చిన నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు పలువురు కీలక నేతలను అరెస్టు చేసినట్లు సమాచారం. రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్ సర్కార్లను సైతం అరెస్టు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని CJP నేతలు ప్రకటించారు.
ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
CJP మరోసారి నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జంతర్ మంతర్‌తో పాటు నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
జంతర్ మంతర్, కనాట్ ప్లేస్, మండి హౌస్, పటేల్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని సూచించారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
CJP ఆందోళనలు, పోలీసుల భద్రతా చర్యల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
