
- ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ముగ్గురిని హాజరుపరిచిన పోలీసులు
- CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ విడుదల
- CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలకు పిలుపునిచ్చిన CJP
- ముంబై నుంచి ఢిల్లీ చేరుకోగానే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల నేపథ్యంలో అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలకు కోర్టులో ఊరట లభించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఆదివారం ఉదయం ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం ముగ్గురినీ విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
శనివారం ముంబై నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 24 గంటల పాటు నిర్బంధంలో ఉన్న అనంతరం కోర్టు ఆదేశాలతో వారు విడుదలయ్యారు.
ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP శనివారం (అక్టోబర్ 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ముగ్గురు నేతలు విడుదల కావడంతో CJP శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఢిల్లీలో పార్టీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
