
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ.. మూడోసారి కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఈసారి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేసి గెలవాలని సవాలు చేశారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ సైతం స్పందించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత వేడిని రాజేస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్య కేంద్రంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అఖిలేశ్ విసిరిన సవాల్‌కు స్పందించిన యోగి.. దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయాలని, తాను కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు.
శనివారం బల్రామ్పూర్ జిల్లాలో రూ.800 కోట్లకు పైగా విలువైన 78 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘అఖిలేశ్ జీ.. మీకో ఆఫర్ ఇస్తున్నా. మీరు శ్రీ అయోధ్య ధామ్ నుంచి నామినేషన్ వేయండి. నేను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తా. కార్యకర్తల వెనుక దాక్కుని పోటీ చేయడం ఎందుకు? ఇద్దరం ముఖాముఖి తేల్చుకుందాం’’ అని సవాల్ విసిరారు.
అదే సమయంలో అయోధ్య ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. అది బీజేపీకి కేవలం రాజకీయ క్షేత్రం కాదని, పవిత్ర స్థలమని యోగి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేసి గెలవాలని అఖిలేశ్ యాదవ్ సవాల్ విసరగా.. అందుకు యోగి నేరుగా ప్రతిస్పందించడంతో యూపీ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
అయోధ్య నుంచి ఎస్పీ అభ్యర్థిగా తేజ్ నారాయణ్ పాండేను ప్రకటించిన తర్వాత బీజేపీ అంతర్గత సర్వేల్లో ఆ పార్టీ వెనుకబడినట్లు తేలిందని అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. పెద్దపెద్ద మాటలు చెప్పే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అంతటి నమ్మకమే ఉంటే.. అయోధ్య నుంచి స్వయంగా పోటీ చేసి గెలిచి చూపించాలని గురువారం సవాల్ విసిరారు.
యోగి వ్యాఖ్యలకు అఖిలేశ్ కూడా ఘాటుగా స్పందించారు. అయోధ్యలో విరాళాల చోరీకి పాల్పడినవారిని ఓడించడానికి తమ ‘పీడీఏ’ యువ సైనికుడు ఒక్కడే సరిపోతాడని అన్నారు. అలాంటి వ్యక్తులకు క్లీన్చిట్ ఇచ్చేవారు కూడా ఆ నేరంలో భాగస్వాములేనని విమర్శించారు. బీజేపీ నేతల అహంకారాన్ని ప్రజలు అణచివేస్తారని పేర్కొంటూ.. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సమాజ్‌వాదీ పార్టీ ఉపయోగించే ‘పీడీఏ’ నినాదం వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను ఉద్దేశించింది. ఈ వర్గాల మద్దతుతో బీజేపీని ఓడిస్తామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. మరోవైపు, అయోధ్యలో రామమందిరానికి సంబంధించిన విరాళాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ విపక్షాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
అయోధ్య ప్రజల మనోభావాలను ప్రస్తావిస్తూ అఖిలేశ్ యాదవ్.. ‘‘దురహంకారుల చేతిలో ఓ తల్లి అవమానాన్ని చూసిన అయోధ్య తల్లులు మిగతా విషయాలను చూసుకుంటారు. మీ అంతర్గత సర్వేలో మీ వైపు నుంచి ఎవరైనా అయోధ్యలో పోటీ చేయాలనుకుంటున్నారని తేలిందా?’’ అంటూ యోగిని ప్రశ్నించారు. దీంతో అయోధ్య కేంద్రంగా ఇరు పార్టీల మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది.
