
తెలంగాణ ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న ఈ పుష్కరాల కోసం సుమారు రూ.900 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఎనిమిది జిల్లాల పరిధిలో 67 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో 11 ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టనుంది. గూడెంగుట్ట, ఓదెల, కొడవటంచ ఆలయాల అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులను సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనుంది.
2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా స్నాన ఘాట్లు, ఆలయాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో.. ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కార్యాలయం ద్వారా వివిధ అభివృద్ధి పనుల అంచనాలను ఖరారు చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించనున్నారు. అలాగే సంబంధిత శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ, పుష్కరాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, పుష్కరాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత పుష్కరాల పనుల కోసం సుమారు రూ.6 వేల కోట్లతో ప్రాథమిక బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. సాంకేతిక కమిటీ చివరకు రూ.1,819 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. శాశ్వత మౌలిక సదుపాయాల పనుల వ్యయాన్ని రూ.1,000 కోట్లకు పరిమితం చేయాలని సూచించింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి, రెండో ప్రాధాన్యత విభాగాల్లో అత్యవసరమైన పనులను గుర్తించి, వాటికి తగినట్లుగా అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సుమారు రూ.900 కోట్ల విలువైన శాశ్వత అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయాల అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం, పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తొలి ప్రాధాన్యత పనుల జాబితాలో గూడెంగుట్టతోపాటు చెన్నూరును కూడా చేర్చాలని భావిస్తోంది.
ఆలయాల పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, రాకపోకలకు అనువైన మార్గాలు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా పనులు చేపట్టడంతోపాటు, పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా యాత్రికులకు ఉపయోగపడేలా శాశ్వత సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2027 గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం స్నాన ఘాట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎనిమిది జిల్లాల పరిధిలో మొత్తం 67 ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పనుల ప్రాధాన్యతను బట్టి ఈ ప్రాంతాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. తొలి ప్రాధాన్యత జాబితాలో 11 ప్రాంతాలు, రెండో జాబితాలో 13 ప్రాంతాలు, మూడో జాబితాలో 43 ప్రాంతాలకు చోటు కల్పించింది.
తొలి ప్రాధాన్యతలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి, నిర్మల్ జిల్లా బాసర, గూడెంగుట్ట, మంచిర్యాల పట్టణం, చెన్నూరు, కోటిలింగాల, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, మంగపేట, భద్రాచలం ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన శాశ్వత సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఏ జిల్లాలో ఎన్ని ఘాట్లంటే?
జిల్లాల వారీగా చూస్తే.. నిజామాబాద్లో 11, నిర్మల్లో 12, మంచిర్యాలలో 10, జగిత్యాలలో 19 ప్రాంతాల్లో ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పెద్దపల్లి జిల్లాలో 4, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, ములుగు జిల్లాలో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 ప్రాంతాలను గుర్తించారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా స్నాన ఘాట్లను అభివృద్ధి చేయడంతోపాటు, రాకపోకల మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. తొలి ప్రాధాన్యత ప్రాంతాల్లో పనులను ముందుగా చేపట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
