
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించడంపై వివాదం చెలరేగింది. పురాతన ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం దారుణమంటూ వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసింది. ఈ అంశంపై రాజకీయంగా చర్చ మొదలవడంతో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి స్పందించారు.
నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన భూసేకరణలో భాగంగానే ఆలయాన్ని తొలగిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ భూసేకరణ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైందని తెలిపారు. అంతేకాకుండా ఆలయానికి సంబంధించి పరిహారంగా కేటాయించిన రూ.59 లక్షలు ప్రస్తుతం బ్యాంకు ఖాతాలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆలయ తొలగింపుపై వస్తున్న ఆరోపణలకు మంత్రి ఇచ్చిన వివరణతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పురాతన ఆలయాన్ని తొలగించడాన్ని తప్పుబడుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిరసనకు దిగారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా స్పందించారు.
ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆంజనేయపురం అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం ఏమాత్రం సమంజసం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ చర్య కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. గతంలోనూ కూటమి ప్రభుత్వం పలు ఆలయాలను ఇదే విధంగా తొలగించిందని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆలయాల కూల్చివేతలకు ఎలా అనుమతిస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనతో ఆలయ కూల్చివేత అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఆంజనేయపురం ఆలయ కూల్చివేత వివాదంపై ఏపీ ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి స్పందించారు. ఆలయ వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయానికి సంబంధించిన అధికారిక రికార్డులు, భూసేకరణ వివరాలు, దేవాదాయశాఖ అధికారుల నివేదికలను పరిశీలించాలని సూచించారు. వాస్తవాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ ఆలయం సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిందని.. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చివేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
నేషనల్ హైవే 716ను నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు 2023లోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయం ఉన్న భూమిని కూడా సేకరించాల్సి వచ్చిందన్నారు. ఇటీవల ఆలయానికి పరిహారం కింద రూ.59,30,606 మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈవో పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని వెల్లడించారు. పరిహారం సొమ్మును వ్యక్తిగతంగా ఎవరికీ చెల్లించలేదని స్పష్టం చేశారు.
ఆలయ తొలగింపు ప్రక్రియ వైదిక సంప్రదాయాలు, ధార్మిక విధానాలకు అనుగుణంగానే జరిగిందని ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. ముందుగా బాలాలయం నిర్మించిన తర్వాత మూలవిరాట్‌ను జాగ్రత్తగా ధాన్యాధివాసంలో ఉంచినట్లు వివరించారు. అలాగే ఆలయంలోని మూలవిరాట్ స్వయంభూ విగ్రహం కాదని, ప్రతిష్ఠించిన విగ్రహమని పేర్కొన్నారు.
ఆలయాన్ని తొలగించడంతోనే ప్రక్రియ ముగిసిపోలేదని మంత్రి తెలిపారు. అదే సర్వే నంబర్లో, ఆలయానికి సంబంధించిన స్థలంలోనే తిరిగి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు ఆలయ కూల్చివేతపై వస్తున్న విమర్శలకు మంత్రి తన వివరణ ఇచ్చారు
మరోవైపు ఆంజనేయస్వామి ఆలయ తొలగింపు వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ కూడా స్పందించింది. నేషనల్ హైవే నిర్మాణం కోసం ఆలయాన్ని తొలగించే అంశంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం 50 సెంట్ల భూమిని కేటాయించినట్లు తెలిపింది. ఆలయానికి సంబంధించిన 10 సెంట్ల భూమిని భూసేకరణలో భాగంగా తీసుకున్నారని, దీనికి పరిహారంగా 2026 ఆగస్టు 1న రూ.59,30,000లను ఆంజనేయస్వామి ఆలయ ఈవో బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు వివరించింది.
స్థానికులు, భక్తులు, అర్చకులు, దేవాదాయశాఖ అధికారుల అనుమతితోనే ఆలయంలోని విగ్రహాలను తొలగించి మరోచోట ప్రతిష్ఠించాలని నిర్ణయించినట్లు ఫ్యాక్ట్‌చెక్ టీమ్ పేర్కొంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం అర్చకులు, దేవాలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్‌ను తరలించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని సమీపంలోనే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించినట్లు స్పష్టం చేసింది.
అయితే ఈ వాస్తవాలను పక్కనపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయడం సరికాదని ఫ్యాక్ట్‌చెక్ టీమ్ హెచ్చరించింది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా తప్పుడు పోస్టులు పెట్టడం, వాటిని ఇతరులకు షేర్ చేయడం నేరమని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.




