
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా మరోసారి పేరు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వంగవీటి రాధాకృష్ణగా పిలుచుకునే ఆయన అసలు పేరు వేరే ఉందనే విషయం ఆసక్తిని రేకెత్తించింది. ప్రమాణ స్వీకారం సమయంలో స్వయంగా ఆయన నోటి నుంచే అసలు పేరు వెల్లడైంది. ఇంతకీ ఆయన అసలు పేరు ఏమిటి? ఆ పేరు వెనుక ఉన్న కథేంటి? ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా ఎన్నికల అధికారి హోదాలో ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయగా.. అనంతరం నగరంలోని 85 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ వరుసగా ప్రమాణం చేయించారు. దీంతో విజయవాడ నగర పాలక సంస్థలో నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది.
అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. మేయర్‌గా ప్రమాణం చేస్తున్న సమయంలో వంగవీటి రాధాకృష్ణ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఆయనను రాధాకృష్ణగా పిలుస్తున్నప్పటికీ.. ఆయన అసలు పేరు గురించి మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
సాధారణంగా అందరూ ఆయన్ను వంగవీటి రాధాకృష్ణ అని పిలుస్తుంటారు. అయితే మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పత్రంలో మాత్రం ఆయన పేరు కొంత భిన్నంగా ఉంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా తన పేరును వంగవీటి రాధాకృష్ణ అని కాకుండా.. వంగవీటి రాధాకృష్ణన్‌గా చదివారు. దీంతో ఆయన అసలు పేరు ఏమిటన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
వాస్తవానికి రాధాకృష్ణకు ఆయన తల్లిదండ్రులు తన పెదనాన్న రాధాకృష్ణమూర్తి పేరు కలిసివచ్చేలా నామకరణం చేశారు. అయితే తమిళనాడులోని ఊటీలో పాఠశాల విద్య అభ్యసించే సమయంలో అక్కడి రికార్డుల్లో ఆయన పేరు రాధాకృష్ణన్‌గా నమోదైంది. అప్పటి నుంచి అధికారిక పత్రాల్లో అదే పేరు కొనసాగుతోంది. వివిధ సందర్భాల్లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలోనూ రాధాకృష్ణన్ అనే పేరే ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొందరు ఆయనను రాధాకృష్ణన్ అని సంబోధించారు. అందువల్ల ప్రజల్లో రాధాకృష్ణగా ప్రసిద్ధి చెందినప్పటికీ.. అధికారిక రికార్డుల ప్రకారం ఆయన పేరు వంగవీటి రాధాకృష్ణన్.
మరోవైపు మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణన్ ముందుగా ప్రమాణ స్వీకారం చేయగా.. అనంతరం కార్పొరేటర్లు వరుసగా ప్రమాణం చేశారు. అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ శైలజ సురభి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆమె అమెరికా పర్యటనలో ఉండటంతో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు.
మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రక్రియలో మేయర్ రాధాకృష్ణన్‌తో పాటు ఎక్స్అఫీషియో సభ్యులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ 12వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆమె పేరును కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా.. మరో కార్పొరేటర్ నందిపాటి దేవానంద్ కుమార్ బలపరిచారు. మెజార్టీ కార్పొరేటర్లు ఆమెకు మద్దతు తెలపడంతో కాంతిశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం నూతన డిప్యూటీ మేయర్‌కు పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
విజయవాడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని నగర మేయర్ వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. నగరంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు విజయవాడ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించిన టీడీపీ అధిష్ఠానానికి, తనకు మద్దతు తెలిపిన కార్పొరేటర్లకు చెన్నుపాటి కాంతిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మేయర్‌తో కలిసి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎన్నికైన కార్పొరేటర్లకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అభినందనలు తెలిపారు. నూతన పాలకవర్గం సమష్టిగా పనిచేసి నగర అభివృద్ధికి కృషి చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. విజయవాడకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లంతా సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



