వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ తనూజారాణి తండ్రి శ్యామసుందరరావు సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో బోనంగి వెంకటరమణ అనే మరో అభ్యర్థి కూడా పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది.

అయితే శ్యామసుందరరావు సైతం వైఎస్సార్‌సీపీ మద్దతుతోనే సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించినట్లు సమాచారం. పార్టీ నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో చివరి నిమిషంలో స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాడేరు సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 26న తొలి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీల్లో ఏకగ్రీవాలు నమోదవుతుండగా.. మరికొన్ని చోట్ల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు. అయినప్పటికీ ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ మద్దతుదారులను అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, పార్టీ మద్దతుతో బరిలోకి దిగాలని ఆశించిన కొందరు నేతలకు నిరాశ ఎదురైంది. పార్టీ నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో పలువురు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు కావడంతో అక్కడి మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లా కేంద్రంలో రాజకీయ, సామాజికంగా తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్ 2న ఇక్కడ పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులతో పాటు పలువురు రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గుమ్మా తనూజారాణి తండ్రి శ్యామసుందరరావు కూడా పాడేరు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎంపీ తనూజారాణి తండ్రి శ్యామసుందరరావు గతంలో హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. సుమారు ఆరు నెలల క్రితమే పాడేరు పంచాయతీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తన ఓటును పాడేరు పంచాయతీకి బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆయన భావించినట్లు సమాచారం. అయితే పార్టీ నుంచి ఆయనకు మద్దతు లభించలేదని ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం బోనంగి వెంకటరమణకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.

దీంతో పార్టీ మద్దతు ఆశించిన శ్యామసుందరరావుకు నిరాశ ఎదురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎంపీ తనూజారాణి తండ్రి ఎన్నికల బరిలోకి దిగడం, వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థితోనే పోటీ పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సార్‌సీపీ మద్దతుతో బోనంగి వెంకటరమణ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. అదే పార్టీకి చెందిన అరకు ఎంపీ తనూజారాణి తండ్రి శ్యామసుందరరావు కూడా పోటీలో నిలవడంతో పాడేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఉండగా.. మరోవైపు ఎంపీ తండ్రి బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై ఎంపీ తనూజారాణి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో చివరకు ఎవరు పోటీలో కొనసాగుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. శ్యామసుందరరావు తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారా? లేక పార్టీ మద్దతు అభ్యర్థి బోనంగి వెంకటరమణ బరి నుంచి తప్పుకుంటారా? అన్న చర్చ స్థానికంగా మొదలైంది. చివరి వరకు ఇద్దరూ పోటీలో కొనసాగితే పాడేరు సర్పంచ్ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బంధువులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే కొందరు విజయం సాధించగా.. మరికొందరికి ఓటమి ఎదురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *