న్యూజిలాండ్ ఇంకా 233 పరుగుల వెనుకబడి ఉండటంతో.. మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టి తొలి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే చివరి రోజు భారత బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మధ్యాహ్నం వరకు భారత బౌలర్లు కాస్త ప్రభావం చూపించినా.. ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. అయితే ఈ ఫలితాన్ని పూర్తిగా బౌలర్ల వైఫల్యంగా చూడలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిచ్‌లో బౌలర్లకు ఏమాత్రం సహకారం లేకపోవడంతో పాటు బంతి కూడా త్వరగా మెత్తబడటం వికెట్లు తీయడాన్ని కష్టతరం చేసిందనే చర్చ జరుగుతోంది.

పిచ్‌లో బౌలర్లకు సహకారం కరువు

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఏకంగా 720 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఈ భారీ స్కోరుతోనే పిచ్ బ్యాటింగ్‌కు ఎంతగా అనుకూలంగా ఉందో స్పష్టమైంది. బౌలర్లకు సహకరించే పరిస్థితులు లేకపోవడంతో చివరి రోజు కూడా వికెట్లు తీయడం అంత సులభం కాలేదు.

30 ఓవర్లకే బంతి మెత్తగా మారుతోందా?

మరోవైపు కూకాబుర్రా బంతి 30 ఓవర్లు పూర్తయ్యేసరికి నునుపుగా మారి సీమ్, స్వింగ్‌కు అనుకూలంగా ఉండటం లేదని ఇరు జట్ల ఆటగాళ్లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బంతిపై లాలాజలం ఉపయోగించడంపై నిషేధం కూడా బౌలర్లకు ఇబ్బందిగా మారుతోందనే వాదన వినిపిస్తోంది.

ఈ అంశంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కూకాబుర్రా బంతులు 25-30 ఓవర్లకే మెత్తబడుతున్నాయని పేర్కొన్నాడు. కొవిడ్ పరిస్థితులు ముగిసి చాలా సంవత్సరాలు గడిచినా.. బంతిపై ఉమ్ము రాయడంపై నిషేధాన్ని కొనసాగించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. పిచ్‌లో వేగం లేకపోవడంతో బౌలర్లకు మరింత ఇబ్బంది ఎదురవుతోందని తెలిపాడు. బంతిపై లాలాజలం ఉపయోగించేందుకు అనుమతించాలని సూచించాడు.

గిల్ కెప్టెన్సీపైనా విమర్శలు

మరోవైపు చివరి రోజు గిల్ కెప్టెన్సీ, ఫీల్డింగ్ వ్యూహాలపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. వికెట్లు సాధించాల్సిన కీలక సమయంలో దూకుడైన ఫీల్డింగ్ ఏర్పాటు చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. షార్ట్ లెగ్, రెండో స్లిప్ వంటి ఫీల్డర్లను తొలగించడం, లెగ్ సైడ్‌లో ఎక్కువగా ఆడే డారిల్ మిచెల్‌కు తగినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేయకపోవడాన్ని తప్పుబట్టారు.

మ్యాచ్ ముగియడానికి మరో గంట సమయం ఉన్నప్పటికీ.. చివరి వరకు విజయానికి ప్రయత్నించకుండా ముందుగానే డ్రాకు అంగీకరించడంపైనా ప్రశ్నలు తలెత్తాయి. మొత్తంగా పిచ్, బంతి పరిస్థితులతో పాటు కెప్టెన్సీ నిర్ణయాలు కూడా భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయనే చర్చ క్రికెట్ వర్గాల్లో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *