టాలీవుడ్ నటుడు శివాజీ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీతో సరదాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులు, రాజధాని అమరావతి అభివృద్ధి, గత పదేళ్లలో రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన మనసులో ఉన్న ఓ కోరికను కూడా బయటపెట్టారు. తనకు ఓ ప్రత్యేకమైన పదవిపై ఆసక్తి ఉందని, చిన్నతనంలో ఎదురైన ఓ సంఘటన కారణంగానే ఆ పదవిలో ఉండాలనే కోరిక కలిగిందని శివాజీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

దేవుడి దయ వల్ల ఇప్పటివరకు తనకు పెద్దగా ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదని టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ తెలిపారు. అయితే ఒకట్రెండు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు కొందరు మాట సాయంతో అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. తాజాగా ‘అలీతో అల్లరి’ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తనకు చేసిన సాయాన్ని కూడా వెల్లడించారు. ఒకానొక సమయంలో చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తనకు ధైర్యం చెప్పారని శివాజీ తెలిపారు. సంయమనం పాటించాలని, ఓపికగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. ఆ సమయంలో తనకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని చంద్రబాబు అడిగారని గుర్తుచేసుకున్నారు. అయితే తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేశానన్నారు. మరేదైనా సాయం కావాలా? అని చంద్రబాబు అడిగినా.. తనకు ఏమీ అవసరం లేదని చెప్పినట్లు శివాజీ వెల్లడించారు.

చిన్నతనం నుంచి తన మనసులో ఓ బలమైన కోరిక ఉందని టాలీవుడ్ నటుడు శివాజీ వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఎదురైన కొన్ని అనుభవాలే తనకు ఎప్పటికైనా టీటీడీ పాలకమండలి చైర్మన్ కావాలనే ఆలోచనను కలిగించాయని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఈ పదవిపై ఆసక్తి ఉందని, అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ అవకాశం దక్కుతుందో లేదో చూడాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్ పదవి దక్కాలంటే తగిన రాజకీయ హోదా కూడా అవసరమని అభిప్రాయపడ్డారు.

లోకేష్‌పై శివాజీ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో యువ రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ ఉత్తమంగా కనిపిస్తున్నారని శివాజీ ప్రశంసించారు. తనను తాను నిరూపించుకోవాలనే తపన లోకేష్‌లో కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాల్లో ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్న నాయకుడని, రాజకీయాల్లో కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నారా కుటుంబం నుంచి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. తండ్రి చంద్రబాబు పేరును ఉపయోగించుకుని బలవంతంగా ఎదగాలని లోకేష్ భావించడం లేదని శివాజీ అభిప్రాయపడ్డారు. తన ప్రతిభతోనే రాజకీయాల్లో నిరూపించుకోవాలనే తపన ఆయనలో ఉందన్నారు. ఫ్యూచర్ విజన్, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు.

లోకేష్‌కు శివాజీ కీలక సూచన

ఈ సందర్భంగా నారా లోకేష్‌కు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు శివాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అయితే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, విద్యార్థుల భవిష్యత్తుపై చర్చించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. కాలేజీ నుంచి బయటకు వచ్చే సమయానికే ప్రతి విద్యార్థికి తన కెరీర్‌పై స్పష్టమైన అవగాహన, ఉపాధి అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇందుకోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ చెన్నై ఐఐటీ తరహాలో వినూత్న ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని లోకేష్‌కు సలహా ఇచ్చారు. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం పెరిగితే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని శివాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇటీవల అనంత్ అంబానీ ఏపీకి వచ్చారని, రాష్ట్రంలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నటుడు శివాజీ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలను ఆ యూనివర్సిటీకి అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలిస్తే బాగుంటుందని సూచించారు. ప్రస్తుతం యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల్లో మాత్రమే ఉద్యోగాలు దొరికే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఐటీ రంగంలోనూ ఉద్యోగాల విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తే యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని శివాజీ అభిప్రాయపడ్డారు.

అమరావతిపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, భూసేకరణ అంశాలపై కూడా శివాజీ స్పందించారు. అమరావతి విషయంలో కొందరు మళ్లీ విమర్శలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని, మరోసారి కులం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే అలాంటి ప్రయత్నాలు ఫలించవని అభిప్రాయపడ్డారు.

అమరావతికి విమానాశ్రయం తప్పనిసరిగా ఉండాలని శివాజీ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేకపోతే వారు ఎలా వస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో వేల ఎకరాల భూములను ఇచ్చారని గుర్తుచేశారు.

అమరావతి ప్రజల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ప్రజారాజధాని అని శివాజీ వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తీసుకున్న భూములతోనే రాజధాని నిర్మాణం జరుగుతోందని, ప్రజల సొమ్మును తీసుకొచ్చి అమరావతిపై ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో మోదీని వ్యతిరేకించా

2014 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తాను వ్యతిరేకించానని శివాజీ గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన సందర్భాల్లో ప్రత్యేక హోదా కోసం నిరసనలు కూడా తెలిపామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన అభిప్రాయాలను గతంలోనూ స్పష్టంగా వ్యక్తం చేశానని ఆయన పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినప్పటికీ.. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని నటుడు శివాజీ అన్నారు. ఈ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడిందని అభిప్రాయపడ్డారు. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి రెండు పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి సహకరిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు అభిమానం ఉందని, దేశానికి ప్రస్తుతం మోదీ నాయకత్వం అవసరమని శివాజీ వ్యాఖ్యానించారు. గతంలో మోదీని విమర్శించిన మాట వాస్తవమేనని, అయితే అవి తన ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే చేశానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.

అదే సమయంలో దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను కూడా విస్మరించలేమని శివాజీ అన్నారు. భారతదేశ అభివృద్ధికి కాంగ్రెస్ కూడా ఎంతో కృషి చేసిందని, దేశ నిర్మాణంలో ఆ పార్టీ చేసిన సేవలు విడదీయలేనివని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *