తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ మరో కీలక భరోసా కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా గత రెండు నెలల్లో తిరుమలలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు బీమా పరిహారం అందజేశారు. దీంతో భక్తులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. ఇంతకీ శ్రీవారి యాత్ర సురక్ష బీమా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలా? బీమా పొందేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరం? ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం ఎలా అందుతుంది? ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా భక్తులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులు ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు బీమా పరిహారం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

టీటీడీ, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 9న అధికారికంగా ప్రారంభించారు. తాజాగా ఈ పథకం ద్వారా గత రెండు నెలల వ్యవధిలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి సహజంగా ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు భక్తుల కుటుంబ సభ్యులకు టీటీడీ, ఎల్ఐసీ ప్రతినిధులు బీమా పరిహారం అందజేశారు. దీంతో ఆపద సమయంలో భక్తుల కుటుంబాలకు ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోంది.

శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం కింద సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలో తిరుమలకు వచ్చిన భక్తుల్లో 17 మంది మరణించగా.. వారిలో ఏడుగురి కుటుంబాలకు ఇప్పటికే బీమా పరిహారం అందించారు. మిగిలిన బాధిత కుటుంబాలకు కూడా త్వరలో పరిహారం చెల్లిస్తామని టీటీడీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో బీమా పరిహారం మొత్తాన్ని మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మరోవైపు, తిరుమలలో మరణించిన భక్తులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు అందించిన వెంటనే బీమా పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎల్ఐసీ అధికారులు తెలిపారు.

ఏడుగురు భక్తుల కుటుంబాలకు బీమా పరిహారం

తిరుమలలో వివిధ తేదీల్లో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు తాజాగా బీమా పరిహారం అందించారు. వారిలో సెప్టెంబర్ 20న తమిళనాడుకు చెందిన పప్పాతి, సెప్టెంబర్ 25న హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మి, అక్టోబర్ 8న చెన్నైకి చెందిన నీలవేణి, అక్టోబర్ 9న చెన్నైకి చెందిన గోపీనాథ్, అక్టోబర్ 11న గుంటూరుకు చెందిన దామోదరరావు, అక్టోబర్ 23న హైదరాబాద్‌కు చెందిన భాగ్యమ్మ, అక్టోబర్ 26న చెన్నైకి చెందిన విశ్వనాథన్ రామకృష్ణన్ ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు బీమా పరిహారం అందజేసినట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ, ఎల్ఐసీ సంయుక్తంగా ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పేరుతో ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే బీమా రక్షణ కల్పిస్తున్నారు.

శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లు బుక్ చేసుకున్న భక్తుల వివరాలు ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి. టికెట్లు లేకుండా నేరుగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను సైతం ఈ బీమా పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతికత ద్వారా క్యూలైన్లలోకి వచ్చిన భక్తుల వివరాలను గుర్తించి నమోదు చేస్తారు.

అంతేకాకుండా తిరుమలలో వివిధ సేవలు అందించే శ్రీవారి సేవకులకు కూడా ఈ బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకం కింద బీమా పొందేందుకు భక్తులు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. దర్శనానికి ఒక రోజు ముందు నుంచి, దర్శనం జరిగే రోజు, ఆ తర్వాతి రోజు వరకు బీమా రక్షణ అందుతుంది. అలాగే తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలోనూ ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది.

‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం కింద పరిహారం పొందాలంటే మృతుల కుటుంబ సభ్యులు టీటీడీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. బీమా పరిహారం కోసం అవసరమైన పత్రాలను అధికారులకు సమర్పించాలి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మరణించిన భక్తుడి డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, నామినీ బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

ఈ పత్రాలను స్వీకరించిన తర్వాత టీటీడీ, ఎల్ఐసీ అధికారులు సంయుక్తంగా వాటిని పరిశీలిస్తారు. బీమా నిబంధనల ప్రకారం అర్హత ఉన్న కుటుంబాలకు పరిహారం మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు.

సందేహాలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి

‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా భక్తులు టీటీడీ 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.

  • 155257
  • 1800-425-4141

ఈ నంబర్లకు ఫోన్ చేసి బీమా పథకం, పరిహారం పొందే విధానం, అవసరమైన పత్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *