టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ ఐటీసీ హోటల్స్ ప్రత్యేకంగా ‘ఎంఎస్ ధోనీ ట్రిబ్యూట్ రూమ్’ను ఏర్పాటు చేసింది. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో ఈ ప్రత్యేక గదిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ధోనీ క్రికెట్ ప్రయాణాన్ని అభిమానులు మరింత దగ్గరగా అనుభూతి చెందేలా దీనిని రూపొందించారు.

ధోనీ కెరీర్‌కు సంబంధించిన అరుదైన జ్ఞాపకాలు

ఈ ప్రత్యేక గదిలో ధోనీ క్రికెట్ ప్రస్థానానికి సంబంధించిన ఎన్నో గుర్తులను ప్రదర్శిస్తున్నారు. అతడు ఉపయోగించిన జెర్సీలు, సంతకం చేసిన క్రికెట్ వస్తువులు, గ్లోవ్స్, స్టంప్స్, ప్రత్యేక ట్రోఫీలను అందులో ఉంచారు. కెరీర్‌లో అతడు సాధించిన కీలక విజయాలు, చిరస్మరణీయ ఘట్టాలను గుర్తుచేసే ఫొటోలు, కళాకృతులు, ప్రత్యేక కథనాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ధోనీకి గుర్తింపుగా నిలిచిన 7వ నంబర్ జెర్సీ ఈ గదికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ప్రత్యేక ఫుడ్ మెనూ.. ప్రీమియం సదుపాయాలు

ధోనీ జెర్సీ నంబర్ 7 స్ఫూర్తితో రూపొందించిన టవల్స్, కుషన్లు సహా పలు ప్రత్యేక సదుపాయాలను అతిథులకు అందించనున్నారు. గది అలంకరణ నుంచి ఇతర సౌకర్యాల వరకు ప్రతి అంశంలోనూ ధోనీ గుర్తులు కనిపించేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా అతడికి ఇష్టమైన ఆహార పదార్థాలతో ‘ది కెప్టెన్స్ ప్యాంట్రీ’ పేరుతో ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఐటీసీ హోటల్స్ మాస్టర్ చెఫ్స్ ఈ వంటకాలను రూపొందించారు. చిన్నారుల కోసం ప్రత్యేక అనుభవాలు, జ్ఞాపికలను కూడా అందుబాటులో ఉంచారు.

రాంచీ నుంచి ప్రపంచ క్రికెట్ వరకు..

ధోనీ జీవిత ప్రయాణాన్ని వివరించే ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శనను కూడా ఈ గదిలో ఏర్పాటు చేశారు. రాంచీలో ప్రారంభమైన అతడి క్రికెట్ ప్రస్థానం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరిన తీరు ఇందులో చూపించనున్నారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా వ్యవహరించడం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను ఈ ప్రదర్శన ద్వారా గుర్తుచేయనున్నారు. కేవలం ధోనీ విజయాలకే పరిమితం కాకుండా.. అతడి వ్యక్తిత్వం, భారత క్రికెట్‌కు చేసిన సేవలను గౌరవించేలా ఐటీసీ హోటల్స్ ఈ ప్రత్యేక గదిని తీర్చిదిద్దింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *