జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు చేపట్టిన టైగర్ ఆపరేషన్ ఐదో రోజుకు చేరుకుంది. గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలోనే పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే గత రెండు రోజులుగా ట్రాకర్ నుంచి పులి కదలికలకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా అందకపోవడంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది.

గత ఐదు రోజులుగా కనుమూరు ఫారెస్ట్‌లోనే పులి తిష్ట వేయడంతో అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినప్పుడు ట్రాకర్ సిగ్నల్స్ గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో సమృద్ధిగా ఆహారం, నీరు అందుబాటులో ఉండటంతో పాటు అనుకూలమైన వాతావరణం ఉండటంతో పులి అక్కడే సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ట్రాకర్ సంకేతాలు సరిగా అందకపోయినా అధికారులు గాలింపు చర్యలను నిలిపివేయలేదు. అటవీ ప్రాంతానికి అన్ని వైపులా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలతో పులి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. పెద్దపులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా పొలాల్లోకి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పులి కదలికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ విజ్ఞప్తి చేశారు. పులి కనిపించినా దాని ఆనవాళ్లు గుర్తించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *