
అమరావతి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని పరివర్తన్ రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు.
వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ప్రయత్నించారని, ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ మరణానంతరం జరిగిన పరిణామాలను సోనియా గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారని గుర్తుచేశారు. ఆత్మగౌరవం కోసమే వైసీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు.
యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం
ఏపీలో రెండు కుటుంబాలే పాలన సాగిస్తున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. తమ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని, థాక్రే తరహాలో రాజకీయ సలహాదారుడి పాత్రకే పరిమితమవుతానని వెల్లడించారు.
జెన్జీ యువత రాజకీయాల్లోకి వచ్చి చట్టాలు రూపొందించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వచ్చే ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.




