జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా భారత సైన్యం, పోలీసులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో కశ్మీర్‌లో అదృశ్యమైన కొందరు వ్యక్తులు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటూ అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. 1991 నుంచి 2003 మధ్య కాలంలో సుమారు 30 మంది అదృశ్యమై, సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను గుర్తించి, కశ్మీర్‌లో వాటిని స్వాధీనం చేసుకునే చర్యలను అధికారులు చేపడుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో గతంలో అదృశ్యమైన 30 మంది వ్యక్తులు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 1991 నుంచి 2003 మధ్య మహోరే, ఛస్నా ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు కనిపించకుండా పోయారు. అప్పట్లో వారి కుటుంబ సభ్యులు తప్పిపోయినట్లు చెబుతూ వచ్చారు. అయితే వీరు ఉద్దేశపూర్వకంగానే సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ బాంబుల తయారీ, మారణాయుధాల వినియోగంలో శిక్షణ పొందిన అనంతరం భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లోని సురక్షిత స్థావరాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి కార్యకలాపాలు కేవలం ఆయుధాలకే పరిమితం కాకుండా ఆస్తుల లావాదేవీలు, యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించడం, ఆర్థిక సహాయం అందించడం వంటి మార్గాల్లోనూ కొనసాగుతున్నట్లు గుర్తించారు. సరిహద్దు అవతలి నుంచి పనిచేస్తున్న ఈ 30 మంది ఉగ్రవాదులకు సంబంధించిన జాబితా తాజాగా వెలుగులోకి వచ్చింది.

జమ్మూలో ఉగ్రవాదాన్ని మళ్లీ విస్తరించే ప్రయత్నాలు

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ 30 మంది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారు. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ విస్తరించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా, నిధుల సమీకరణ, స్థానిక యువతను ప్రలోభపెట్టడం, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు అవతలి నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కట్టడి చేసేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి.

నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో పోలీసులు UAPA, భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతోపాటు రియాసీ జిల్లాలోని తమ స్వస్థలాల్లో ఉన్న పూర్వీకుల భూములను విక్రయించి, ఆ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల ఆస్తుల జప్తు

డీజీపీ ఆదేశాల మేరకు ఐదుగురు కీలక ఉగ్రవాదులకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు రియాసీ ఎస్ఎస్పీ ముకుంద్ లాల్ వెల్లడించారు. మొదటి విడతలో మహోర్‌కు చెందిన మహ్మద్ కయూమ్ అలియాస్ అబ్దుల్ కయూమ్ షాడోల్, బద్దర్‌కు చెందిన బషీర్ అహ్మద్ అలియాస్ మాసూమ్, అర్నాస్‌కు చెందిన షౌకత్ అలీ హుందర్, తురూ గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ అలియాస్ మంజూర్ హుస్సేన్ ఖాంటి ఆస్తులను అధికారులు జప్తు చేశారు.

నివేదికలో పేర్కొన్న మిగిలిన 25 మందిలాగే వీరు కూడా ఆయుధ శిక్షణ పొందేందుకు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు తమ స్థానిక సహాయకుల ద్వారా పూర్వీకుల భూములు, ఇతర ఆస్తులను విక్రయించి నగదుగా మార్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సొమ్మును ఆయుధాల సమీకరణ, కొత్త సభ్యుల నియామకం, దాడులకు సంబంధించిన కార్యకలాపాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించడంతోపాటు ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్థానిక వ్యక్తులపై కూడా నిఘా పెంచినట్లు సమాచారం.

ఉగ్రవాదులకు చెందిన ఆస్తులను జప్తు చేయడం ద్వారా వాటిని విక్రయించి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఉగ్రవాదుల ఆస్తుల విక్రయానికి సహకరించడం కూడా వారికి ఆయుధాలు అందించడంతో సమానమైన తీవ్రమైన నేరమని అధికారులు హెచ్చరించారు. పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి.

కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదాన్ని దాదాపుగా అంతం చేసిన భద్రతా బలగాలు.. ఇప్పుడు విదేశీ ఉగ్రవాదులపై దృష్టి సారించాయి. చివరి స్థానిక ఉగ్రవాదిగా పేర్కొంటున్న లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్ తర్వాత స్థానిక ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌లో ఉంటూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విదేశీ ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *