
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజ్ఞాన విహార్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ ఎన్నికల నిర్వహణ పోలింగ్ ఏర్పాట్లు సిబ్బంది విధులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా తీసుకున్న చర్యలను సమీక్షించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు ఎన్నికల నియమావళి అమలు తీరును తనిఖీ చేశారు.
అనంతరం అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా జరుగుతోందని తెలిపారు. గతంలో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం మెరుగ్గా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎక్కడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు.
రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఎన్నికల భద్రతకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని వివరించారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ శా పాల్గొన్నారు.




