
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 53.86 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు 16.25 శాతంగా ఉన్న ఓటింగ్ తర్వాతి రెండు గంటల్లోనే గణనీయంగా పెరిగి 53.86 శాతానికి చేరుకుంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా 75.02 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 67.70 శాతం, మార్కాపురం జిల్లాలో 64.02 శాతం, అనంతపురం జిల్లాలో 64.01 శాతం ఓటింగ్ నమోదైంది.
మరోవైపు వైఎస్సార్ కడప జిల్లాలో అత్యల్పంగా 20.22 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలవరం జిల్లాలో 34.35 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 43.11 శాతం, విజయనగరం జిల్లాలో 43.73 శాతం ఓటింగ్ నమోదైంది.
ఇక కాకినాడ జిల్లాలో 62.13 శాతం, నెల్లూరులో 60.94 శాతం, పార్వతీపురం మన్యంలో 60.42 శాతం, చిత్తూరు జిల్లాలో 60.05 శాతం పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాల్లో ఓటింగ్ 60 శాతం మార్కును దాటింది. ముఖ్యంగా మార్కాపురం జిల్లాలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది.
ఉదయం 9 గంటల సమయానికి కేవలం 2.60 శాతంగా ఉన్న ఓటింగ్ 11 గంటల సమయానికి ఏకంగా 64.02 శాతానికి చేరుకుంది. మొత్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఉదయం వేళ నుంచే ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటుండటంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతోంది.




