
ఆసియా క్రీడల్లో గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో భారత్‌కు రజత పతకం సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఆ విభాగంలో భారత రెజ్లర్లకు చాలాకాలంగా స్వర్ణం అందని ద్రాక్షగానే ఉంది. రజతం కూడా దశాబ్దాలుగా దూరంగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో హరియాణాలోని జాగ్సీ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన నితేశ్ సివాచ్ భారత రెజ్లింగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.
క్రికెట్ నుంచి రెజ్లింగ్ వైపు..
నితేశ్ మొదట్లో రెజ్లర్ కావాలని అనుకోలేదు. చిన్నతనంలో క్రికెట్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది. అయితే అతడి తండ్రి ఆనంద్ మాత్రం కుమారుడు రెజ్లింగ్‌లో రాణించాలని భావించాడు. అందుకే ఖర్కోదాలోని ప్రతాప్ స్పోర్ట్స్ స్కూల్లో చేర్పించాడు. మొదట రెజ్లింగ్‌పై ఆసక్తి చూపని నితేశ్.. కబడ్డీపై దృష్టి పెట్టాడు.
అయితే స్కూల్లో ఎక్కువ మంది రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకోవడంతో క్రమంగా ఆ క్రీడపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ప్రాక్టీస్‌లో మోకాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో నెలల పాటు ఇంటికే పరిమితమయ్యాడు.
రెండేళ్లు పాల వ్యాపారంలో..
గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో నితేశ్ తండ్రికి పాల వ్యాపారంలో సాయం చేశాడు. 2017 నుంచి రెండేళ్ల పాటు పానిపట్ వెళ్లి పాలు విక్రయించాడు. ఉదయం ఐదు గంటలకే మొదలయ్యే ఆ పని.. సాయంత్రం వరకు కొనసాగేది. ఈ జీవితం తనకు కష్టంగా అనిపించడంతో మళ్లీ రెజ్లింగ్‌లోకి రావాలని నిర్ణయించుకున్నాడు.
ఈసారి మాత్రం పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. కోచ్‌లు ఓం ప్రకాశ్ దహియా, సందీప్ పర్యవేక్షణలో తన నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడు. ‘ఏదో ఒకరోజు నువ్వు ప్రపంచ ఛాంపియన్ అవుతావు’ అంటూ కోచ్‌లు ఇచ్చిన ప్రోత్సాహం నితేశ్లో మరింత నమ్మకాన్ని పెంచింది.
ఆసియా క్యాడెట్ నుంచి ఆసియా క్రీడల వరకు..
వయసు విభాగాల జాతీయ పోటీల్లో రాణించిన నితేశ్.. 2019 ఆసియా క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 2022 అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు.
2025 సీనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన నితేశ్.. ఈ ఏడాది అదే టోర్నీలో రజతం సాధించాడు. తాజాగా ఆసియా క్రీడల్లోనూ రజత పతకంతో తన ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.
తన ప్రయాణంపై నితేశ్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులో మోకాలికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రెండేళ్లు తండ్రికి పాల వ్యాపారంలో సాయం చేశానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ రెజ్లింగ్‌లోకి వచ్చి గ్రీకో-రోమన్ విభాగాన్ని ఎంచుకుని రాణించడం ఆనందంగా ఉందన్నాడు.
ఆసియా క్రీడల్లో 97 కేజీల విభాగంలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉందని, తుది పోరులో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉంటే బాగుండేదని నితేశ్ పేర్కొన్నాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్పై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించాడు.
