ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అక్టోబర్ 3న జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

దాయాదుల పోరు కావడం.. అందులోనూ ఆసియా క్రీడల్లో స్వర్ణం కోసం తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. అయితే నిషిన్‌లో వర్షం పరిస్థితులు మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలు ఉండటంతో.. ఒకవేళ ఫైనల్ పూర్తిగా రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.

మ్యాచ్ రద్దయితే రెండు జట్లకూ గోల్డ్?

2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా నిర్వహించలేని పరిస్థితి వస్తే భారత్, పాకిస్థాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే నిబంధన ఉంది. అంటే రెండు జట్లకూ స్వర్ణ పతకాలు లభిస్తాయి.

2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భారత్–అఫ్గానిస్థాన్ ఫైనల్ వర్షం కారణంగా రద్దవడంతో అప్పటి నిబంధనల ప్రకారం మెరుగైన టీ20 ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌కు స్వర్ణం దక్కింది. 2026లో ఆ విధానం వర్తించదు.

సెమీస్‌లో టీమిండియా భారీ విజయం

భారత్ సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 38 పరుగులతో మెరుపు ఆరంభం అందించగా.. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేశాడు.

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. 9.4 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అభిషేక్ శర్మ కూడా రెండు వికెట్లతో రాణించాడు.

పాక్‌ను ఫైనల్‌కు చేర్చిన సమద్, నవాజ్

మరో సెమీఫైనల్లో పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది.

అనంతరం పాకిస్థాన్ 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అబ్దుల్ సమద్, హసన్ నవాజ్ కీలక భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చి ఫైనల్‌కు పంపించారు.

ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్–పాక్ ఫైనల్

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి ఫైనల్లో తలపడనున్నాయి. దీంతో ఈ గోల్డ్ మెడల్ పోరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ గత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా.. ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారుతుందా? లేక పూర్తి మ్యాచ్ జరిగి విజేత ఎవరో తేలుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాతావరణం అనుకూలిస్తే భారత్–పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన గోల్డ్ మెడల్ పోరు జరగనుంది.