ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మలేసియాతో జరిగిన ఫైనల్లో 5-1 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. దీంతో ఈ ఎడిషన్‌లో భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు చేరాయి. మొత్తంగా 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఫైనల్లో అదరగొట్టిన టీమిండియా

ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచే భారత్, మలేసియా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 11వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు తొలి ఆధిక్యాన్ని అందించాడు. అయితే 14వ నిమిషంలో మలేసియా గోల్ చేయడంతో స్కోరు సమమైంది.

ఆ తర్వాత 23వ నిమిషంలో లక్రా భారత్‌కు మరో గోల్ అందించాడు. అనంతరం భారత ఆటగాళ్లు మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. రెండో అర్ధభాగంలో మరింత దూకుడుగా ఆడిన భారత్ వరుసగా గోల్స్ సాధిస్తూ 5-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

ఈ విజయంతో ఒకే ఆసియా క్రీడల ఎడిషన్‌లో పురుషుల, మహిళల హాకీ విభాగాల్లో భారత్ స్వర్ణాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అంతిమ్‌కు రజతం.. దీపక్‌కు కాంస్యం

మహిళల 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఫైనల్‌లో పరాజయం పాలైంది. దీంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకుంది. పురుషుల 97 కేజీల విభాగంలో దీపక్ పునియా కాంస్య పతకాన్ని సాధించాడు.

పతకాల పట్టికలో చైనానే అగ్రస్థానం

ఆసియా క్రీడలు 2026 పతకాల పట్టికలో చైనా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. చైనా 167 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలతో మొత్తం 339 పతకాలు సాధించింది. అయితే గత ఎడిషన్‌తో పోలిస్తే చైనా మొత్తం పతకాల సంఖ్య తగ్గింది. 2022లో ఆ దేశం 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో 383 పతకాలు సాధించింది.

ఆతిథ్య జపాన్ మాత్రం గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. 2022లో 188 పతకాలు సాధించిన జపాన్.. ఈసారి 265 పతకాలకు చేరుకుంది. దక్షిణ కొరియా పతకాల సంఖ్య 190 నుంచి 149కి తగ్గింది.

భారత్ విషయానికి వస్తే.. గత ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించిన టీమిండియా, ఈసారి 85 పతకాలతో తన ప్రయాణాన్ని ముగించింది.