ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఉదయం నగోయాలోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది.

మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ విజయంపై స్పందించాడు. ఈ గెలుపును వర్ణించడానికి ‘ఎక్స్ట్రాటిక్’ అనే పదం సరిపోతుందని చెప్పాడు. ఒక దశలో పాక్ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో గోల్డ్ మెడల్ దక్కుతుందా అనే సందేహం కలిగిందని తెలిపాడు. అయితే కీలక సమయంలో శివమ్ దూబే వికెట్లు తీయడంతో మ్యాచ్ మళ్లీ భారత్ చేతుల్లోకి వచ్చిందని పేర్కొన్నాడు.

ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు

జపాన్‌కు వచ్చినప్పటి నుంచి భారీ వర్షాల కారణంగా దాదాపు వారం రోజుల పాటు సరైన ప్రాక్టీస్‌కు అవకాశం లేకపోయిందని శ్రేయస్ చెప్పాడు. అయినప్పటికీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ కొనసాగించారని తెలిపాడు.

‘‘ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఎలాంటి కారణాలు చెప్పలేదు. అందుబాటులో ఉన్న అవకాశాలతో తమను తాము సిద్ధం చేసుకున్నారు. ఛాంపియన్ జట్టుకు ఉండాల్సిన లక్షణం ఇదే. ఫైనల్లో మా ప్రదర్శన కూడా దానినే చూపించింది’’ అని శ్రేయస్ అన్నాడు.

కీలక సమయంలో దూబే వికెట్లు

పాకిస్థాన్ బ్యాటర్లు ఒక దశలో మంచి వేగంతో పరుగులు సాధించారని.. దీంతో కొంత ఒత్తిడికి గురయ్యానని శ్రేయస్ వెల్లడించాడు. అయితే ఐదో బౌలర్ ఓవర్లను ముందుగా పూర్తి చేసి, ఆ తర్వాత బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ప్రధాన బౌలర్లను సరైన సమయంలో ఉపయోగించాలని భావించినట్లు చెప్పాడు.

రన్‌రేట్ 13-14 పరుగుల స్థాయికి చేరినప్పుడు ఒక్క వికెట్ పడినా మ్యాచ్ పరిస్థితులు పూర్తిగా మారతాయని తమకు తెలుసని పేర్కొన్నాడు. అయూబ్ వికెట్ కీలకంగా మారిందని, ఆ తర్వాత శివమ్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చాడని ప్రశంసించాడు.

సమష్టి ప్రదర్శనే విజయానికి కారణం

ఫైనల్లో ప్రతి ఆటగాడు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడని శ్రేయస్ తెలిపాడు. అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్ని అందించగా.. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముగించాడని చెప్పాడు. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తమ పాత్రను సమర్థంగా పోషించారని పేర్కొన్నాడు.

ముఖ్యంగా శివమ్ దూబే కీలక సమయంలో రెండు వికెట్లు తీయడం మ్యాచ్‌ను మలుపుతిప్పిందని అన్నాడు. టోర్నీ మొత్తం ప్రతి ఆటగాడు కష్టపడ్డాడని.. ఈ స్వర్ణ పతకం ఏ ఒక్కరి ఘనత కాదని, జట్టు సమష్టి ప్రదర్శన ఫలితమేనని శ్రేయస్ స్పష్టం చేశాడు.

గోల్డ్ మెడల్‌తో ఫుల్ జోష్

స్వర్ణ పతకం గెలవడం చాలా సంతోషంగా ఉందని శ్రేయస్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం త్వరగా హోటల్‌కు వెళ్లి ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు జట్టు ఎదురుచూస్తోందని తెలిపాడు.

‘‘టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడమే గొప్ప విషయం. అలాంటి బాధ్యతతో బంగారు పతకం సాధించడం మరింత ప్రత్యేకం. దేవుడికి కృతజ్ఞతలు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను’’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.

ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 21 పరుగులు చేశాడు.