
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్, త్రివిక్రమ్ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మళ్లీ వాయిదా పడుతుందా?
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘ఆదర్శ కుటుంబం’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులే కారణమా?
సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్, ఆడియోకు సంబంధించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాలేదనే టాక్ వినిపిస్తోంది. క్వాలిటీలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో మరికొంత సమయం తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త రిలీజ్ డేట్‌పై టాక్
డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘ఆదర్శ కుటుంబం’ను ఈ నెల 30న విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరులో రిలీజ్ చేయడం ద్వారా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేయడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద సోలో రిలీజ్ అవకాశాన్ని కూడా పొందవచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.
