టాటా గ్రూపులో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరో కీలక మలుపు తిరిగింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), ఆర్డీ టాటా ట్రస్ట్ (RDTT) బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. గురువారం ఈ రెండు ట్రస్టులు పిటిషన్లు దాఖలు చేశాయి. తమకు జరిగిన నష్టానికి పరిహారంగా SDTT రూ.50 కోట్లు, RDTT రూ.15 కోట్లు చెల్లించాలని, దీనికి 18 శాతం వార్షిక వడ్డీ కూడా ఇవ్వాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రశేఖరన్ పునర్నియామకమే వివాదానికి కారణం

టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ 17న సమావేశమై ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగించేందుకు తీర్మానం ఆమోదించింది. అయితే ఈ నిర్ణయం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA)లోని 121వ నిబంధనకు అనుగుణంగా లేదని టాటా ట్రస్ట్స్ తమ పిటిషన్లలో పేర్కొన్నాయి. చైర్మన్ నియామకానికి అవసరమైన అనుకూల ఓట్లు లభించనందున బోర్డు తీర్మానం చెల్లదని వాదించాయి.

ఈ పిటిషన్లపై శుక్రవారం బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. నవంబర్ 30న జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ చైర్మన్ హోదాలో ఓటు వేయకుండా అడ్డుకోవడం కూడా ఈ న్యాయపోరాటం వెనుక ఉన్న ఉద్దేశాల్లో ఒకటిగా తెలుస్తోంది.

అసలు వివాదం ఎలా మొదలైంది?

చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగించాలన్న ప్రతిపాదనతో టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. నోయల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉంది. సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం, బోర్డులోని ఇద్దరు ట్రస్టీ నామినీ డైరెక్టర్లు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుందని ట్రస్టులు పేర్కొంటున్నాయి.

అయితే ఈ నియామక ప్రతిపాదనపై నోయల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేయగా, మరో నామినీ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం. దీంతో అవసరమైన మద్దతు లభించలేదని, చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానం చెల్లుబాటు కాదని టాటా ట్రస్ట్స్ వాదిస్తున్నాయి.

లేఖలకు స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయం

సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్‌కు టాటా ట్రస్ట్స్ పలు లేఖలు పంపినట్లు తెలుస్తోంది. అయితే వాటికి ఆశించిన స్పందన రాకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రెండు ట్రస్టులు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పిటిషన్లు దాఖలు చేయాలని తీర్మానించి, గురువారం బాంబే హైకోర్టులో పిటిషన్లు సమర్పించాయి.

ఈ పరిణామాలతో టాటా గ్రూపులో నాయకత్వం, బోర్డు నిర్ణయాధికారాలు, ట్రస్టుల పాత్రపై కొనసాగుతున్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నవంబర్ 30న జరగనున్న బోర్డు సమావేశం, హైకోర్టు విచారణ ఈ వివాదంలో కీలకంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *