‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన జాన్వీ కపూర్ వీడియోను కొందరు ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా నటులు విజయ్ దేవరకొండ, కల్యాణ్ రామ్ కూడా ఘాటుగా స్పందించారు. ఏఐ టెక్నాలజీని ఇలాంటి దుర్వినియోగానికి ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయం కాదని వారు పేర్కొన్నారు.

‘ఇది డిజిటల్ లైంగిక దాడితో సమానం’

విజయ్ దేవరకొండ ఈ ఘటనపై స్పందిస్తూ.. సమాజం ఇంత దిగజారిపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శిక్షలు కఠినంగా ఉంటే భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి పనులు చేయడానికి భయపడతారని పేర్కొన్నారు.

ఇతరులను అవమానించడంలో ఆనందం పొందే స్థాయికి సమాజం ఎందుకు చేరిందని ప్రశ్నించిన విజయ్.. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతామేమోనని ప్రపంచం ఆందోళన చెందుతుంటే, కొందరు మాత్రం అదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళను ఇలా అవమానించేలా ఏఐని ఉపయోగించడం డిజిటల్ లైంగిక దాడితో సమానమని అభిప్రాయపడ్డారు.

కఠినమైన నిబంధనలు రావాలి: కల్యాణ్ రామ్

ఈ ఘటనపై కల్యాణ్ రామ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఏఐ సాయంతో ఒక మహిళను ఈ విధంగా అవమానించడం అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

త్వరలోనే ఏఐ దుర్వినియోగాన్ని నియంత్రించేలా కఠిన చట్టాలు, నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్లు కల్యాణ్ రామ్ తెలిపారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులంతా ఒకే స్వరంతో స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.