రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణం’కు సంబంధించి ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

టెంట్లో చెలరేగిన మంటలు

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బి.ఎన్. తివారీ ఈ ఘటనపై స్పందించారు. స్టూడియో బయట ఏర్పాటు చేసిన ఓ చిన్న టెంట్లో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పలేదని చెప్పారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా షూటింగ్ సెట్లలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని నిర్మాతలను ఇప్పటికే హెచ్చరించినట్లు తివారీ పేర్కొన్నారు. ఇటీవలే సమీపంలోని మరో ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినప్పటికీ ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈసారి పెద్ద నష్టం జరగకపోయినా.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రతి నిర్మాణ సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’

ప్రస్తుతం ‘రామాయణం’ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు లేదా రణ్‌బీర్ కపూర్ సెట్లో ఉన్నారా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ‘రామాయణం’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది.

దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని భారత్‌లో నవంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 5, 6 తేదీల్లో ప్రీమియర్లతో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.