మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తనలోని దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న గ్లోబల్ స్లాషర్ మూవీ ‘కల్ట్’ (CULT)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు పెద్దగా టచ్ చేయని స్లాషర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయింది.

భారీ సెట్స్‌లో యాక్షన్ ఎపిసోడ్స్

‘కల్ట్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్స్ నిర్మించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 40 నుంచి 50 రోజుల పాటు వందలాది మోడల్స్‌తో యాక్షన్, స్లాషర్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో రూపొందించిన ఈ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘కల్ట్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. షూటింగ్ కూడా పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, అక్టోబర్ 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

టాప్ టెక్నీషియన్స్‌తో భారీ నిర్మాణం

ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ పలువురు ప్రముఖ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ‘కల్ట్’కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అలాగే ‘యానిమల్’ సినిమాకు సౌండ్ డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సచిన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

జెన్-జీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తరుణ్ భాస్కర్ రాసిన డైలాగ్స్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తారక్ సినిమా బ్యానర్‌పై సందీప్ కాకరాల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విశ్వక్ సేన్ సరసన గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘పుష్ప’ ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల కానున్న ఈ సినిమాను ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ మూవీగా మేకర్స్ పరిచయం చేస్తున్నారు. మరి అక్టోబర్ 30న ‘కల్ట్’ ఎలాంటి థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందో చూడాలి.