
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా విడుదలను వాయిదా వేయడానికి దారితీసిన పరిస్థితులపై ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్, నెగెటివ్ ప్రచారం కూడా నిర్ణయంపై ప్రభావం చూపిందని ఆయన వెల్లడించారు.
పోస్ట్ ప్రొడక్షన్లో ఊహించని ఆలస్యం
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని నాగవంశీ తెలిపారు. ఆదివారం వరకు విదేశాల్లో సెన్సార్ కోసం అవసరమైన కాపీని కూడా సిద్ధం చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు.
వాస్తవానికి అక్టోబర్ 9న సినిమాను విడుదల చేస్తే.. మరుసటి రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఉండటంతో మంచి ప్రయోజనం ఉంటుందని తొలుత భావించినట్లు తెలిపారు. నిర్మాతగా తాను కూడా అదే తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నానని చెప్పారు.
సోషల్ మీడియా భయం కూడా ఓ కారణమే
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని నాగవంశీ పేర్కొన్నారు. హడావుడిగా సినిమాను విడుదల చేసి, నాణ్యతలో రాజీ పడితే ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
అందుకే తొందరపడకుండా సినిమా పనులను పూర్తి స్థాయిలో ముగించి, మెరుగైన క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు వివరించారు. ఈ నిర్ణయం వల్ల కొందరు విమర్శించినా.. సినిమా విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
‘100 శాతం క్వాలిటీతో ఇస్తాం’
సినిమాను వాయిదా వేయడం వల్ల అవుట్‌పుట్ మరింత మెరుగ్గా వస్తుందా అన్న ప్రశ్నకు నాగవంశీ ధీమాగా స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావుడిగా విడుదల చేస్తే సుమారు 80 శాతం అవుట్‌పుట్ మాత్రమే ఇవ్వగలనని, కానీ పూర్తి సమయం తీసుకుంటే 100 శాతం క్వాలిటీతో సినిమాను అందించగలమని అన్నారు.
ప్రస్తుతం అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ.. థియేటర్లలో వారికి మెరుగైన అనుభూతిని అందించేలా సినిమాను సిద్ధం చేస్తామని నాగవంశీ హామీ ఇచ్చారు.
