విజయవాడ, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కనకదుర్గమ్మ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో ప్రసాదాల విక్రయాలు జోరందుకున్నాయి. వివిధ సేవలు, దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాలు తదితర మార్గాల ద్వారా సోమవారం సాయంత్రం 5 గంటల వరకు దేవస్థానానికి రూ.25,41,907 ఆదాయం సమకూరింది. ఇందులో నగదు రూపంలో రూ.8,46,199, ఆన్‌లైన్‌ ద్వారా రూ.16,95,708 లభించినట్లు అధికారులు వెల్లడించారు.

97,903 లడ్డూల విక్రయం

దసరా ఉత్సవాల రెండో రోజు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 97,903 లడ్డూలు విక్రయించినట్లు దేవస్థానం లడ్డూ విక్రయాల నివేదిక పేర్కొంది. వీటిలో ఆరు లడ్డూల బాక్సులు 13,760, మూడు లడ్డూల బాక్సులు 3,082, సింగిల్‌ లడ్డూలు 6,097 ఉన్నాయి. గత ఏడాది ఉత్సవాల రెండో రోజుతో పోలిస్తే ఈసారి 3,878 లడ్డూలు అధికంగా విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే రోజున 94,025 లడ్డూలు అమ్ముడయ్యాయి.

ప్రసాదాల విక్రయాలతో అధిక ఆదాయం

దేవస్థానానికి వచ్చిన ఆదాయంలో ప్రసాదాల విక్రయాలు ప్రధానంగా నిలిచాయి. రూ.15 లడ్డూల విక్రయం ద్వారా రూ.52,170, మూడు లడ్డూల ప్యాక్‌ల ద్వారా రూ.1,54,000, ఆరు లడ్డూల ప్యాక్‌ల ద్వారా రూ.13,24,000 ఆదాయం లభించింది. రూ.1,000 ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.3,38,000 సమకూరింది.

ఇక పరోక్ష ప్రత్యేక కుంకుమార్చన ద్వారా రూ.72,000, పరోక్ష ప్రత్యేక చండీహోమం ద్వారా రూ.16,000, పరోక్ష ప్రత్యేక శ్రీచక్రనవార్చన ద్వారా రూ.1,32,000 ఆదాయం వచ్చింది. ఇతర పూజల ద్వారా రూ.85,116, ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా రూ.1,22,784, కేశఖండన ద్వారా రూ.50,520 సమకూరాయి. చెవి, ముక్కు కుట్టించడం, ఈ-హుండీ, ప్రచురణలు, విరాళాలు తదితర మార్గాల ద్వారా మరో రూ.1,95,317 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *