
మహిళలకు బతుకమ్మ పండగ నుంచి నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో డీప్‌ఫేక్ అని తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ తేల్చింది.
2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో నిర్వహించిన బసవ జయంతి వేడుకలకు సంబంధించిన అసలు వీడియో దృశ్యాలను తీసుకుని, వాటికి ఏఐ ద్వారా రూపొందించిన ఆడియోను జత చేసినట్లు ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది.
అయితే మహిళలకు నెలకు రూ.2,500 సాయం అందిస్తామనే హామీ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని ‘మహాలక్ష్మి’ పథకంలో ఉంది. కానీ కల్యాణలక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తామనే హామీ మాత్రం కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో లేదు
బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ కీలక స్పష్టత ఇచ్చింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో మార్ఫింగ్ చేసినదని ఫ్యాక్ట్‌చెక్ టీమ్ తేల్చింది. ప్రజలు ఈ వీడియోను నమ్మవద్దని సూచించింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలు, వేదికలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఫ్యాక్ట్‌చెక్ వివరాల ప్రకారం.. వైరల్ వీడియోలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు అసలైనవే. అయితే వీడియోలోని ఆడియోను మాత్రం మార్చినట్లు గుర్తించారు. 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించిన అసలు వీడియో దృశ్యాలను తీసుకుని, వాటికి ఏఐతో రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జత చేసినట్లు ఫ్యాక్ట్‌చెక్ బృందం వెల్లడించింది.
సీఎం రేవంత్‌రెడ్డి రెండు కొత్త హామీలు ప్రకటించినట్లుగా ఈ మార్ఫింగ్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తెలిపింది. వైరల్ ఆడియోను ఏఐ డిటెక్షన్ టూల్స్‌తో పరిశీలించగా, అది డీప్‌ఫేక్ ఆడియోగా నిర్ధారణ అయినట్లు ఫ్యాక్ట్‌చెక్ బృందం పేర్కొంది.
వైరల్‌గా ప్రచారంలో ఉన్న రెండు అంశాల్లో ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగమే. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లోనూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు.
మరోవైపు, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని చేసిన ప్రకటన ఆరు గ్యారంటీల్లో భాగం కాదు. అయితే, ఈ పథకం కింద ఒక తులం బంగారం ఇస్తామని గతంలో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అధికారిక జాబితాలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆరు హామీలను అధికారికంగా ఇదే విధంగా పేర్కొంది.
కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకం. ప్రభుత్వ పత్రాల ప్రకారం, అర్హులైన కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం కొనసాగుతోంది. ఇటీవల ఈ పథకానికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది.
అందువల్ల వైరల్ వీడియోలో కనిపించే రూ.2,500 ఆర్థిక సాయం ప్రకటనను పూర్తిగా కొత్త హామీగా భావించడం సరికాదు. ఈ హామీ మహాలక్ష్మి పథకంలోని ఆరు గ్యారంటీల్లోనే ఉంది. అయితే, బతుకమ్మ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, కల్యాణలక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం డీప్‌ఫేక్‌గా తేలింది.
సంక్షేమ పథకాల అమలు, కొత్త ప్రకటనలు, అర్హతలు, ప్రారంభ తేదీలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వీడియోలు లేదా పోస్టుల ఆధారంగా నమ్మకుండా, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలు, పత్రాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని ఫ్యాక్ట్‌చెక్ బృందం ప్రజలకు సూచించింది.
