
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌కు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారని, బ్యాంకింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా అకౌంట్ల నిర్వహణ, బ్యాక్ ఎండ్ కార్యకలాపాల కోసం రాత్రి వరకు పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నాలుగు శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించి, బ్యాంకుల్లో 5 డేస్ వీక్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత కోరారు. అవసరమైతే షిఫ్ట్ విధానాన్ని అమలు చేసి బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని సూచించారు.
వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమలు చేయాలన్న డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో అర్థరాత్రి జరిగిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌కు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత వీడియోను విడుదల చేశారు.
అధిక పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పనిదినాల విధానం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఉదయం బ్యాంకులు ప్రారంభమైనప్పటి నుంచి ఖాతాదారుల సేవలతో పాటు బ్యాక్ ఎండ్ పనులు, టార్గెట్ల నిర్వహణ, కరెన్సీ లెక్కింపు వంటి వివిధ బాధ్యతలతో ఉద్యోగులు రోజంతా బిజీగా ఉంటున్నారని తెలిపారు. పలువురు ఉద్యోగులు రాత్రి 9, 10 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని అన్నారు.
గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు విస్తరించడంతో పాటు ఏటీఎం సేవలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లే అవసరం తగ్గిందని కవిత గుర్తుచేశారు. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగులపై పనిభారం మాత్రం తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని కవిత కోరారు.
బ్యాంకు ఉద్యోగులు ఇటీవల సమ్మెకు వెళ్లారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్త డిమాండ్ ఏమీ కాదు.. వాస్తవానికి చాలా కాలంగా వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్.
మనలో చాలామందికి బ్యాంకు ఉద్యోగులు ఏం పని చేస్తారనే భావన ఉంటుంది. కూర్చొని చెక్కులపై సంతకాలు చేయడం, కస్టమర్లకు సేవలు అందించడం మాత్రమే వారి పని అనుకుంటాం. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
బ్యాంకు ఉద్యోగులు ఉదయం 9 గంటలకే విధులకు హాజరవుతారు. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత కూడా వెంటనే ఇంటికి వెళ్లలేరు. సాయంత్రం 4 లేదా 5 గంటలకే బ్యాంకు క్లోజ్ చేసినా.. ఆ తర్వాత అకౌంట్లను బ్యాలెన్స్ చేయడం, రోజువారీ లావాదేవీలను పూర్తి చేయడం వంటి పనులు చేస్తూ రాత్రి 7, 8, 9, ఒక్కోసారి 10 గంటల వరకు కూడా బ్యాంకులోనే ఉండాల్సి వస్తుంది.
అంటే ప్రతిరోజూ 10 నుంచి 12 గంటల వరకు పని చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు గత పదేళ్లుగా చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నెలలో రెండు శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించింది. ఆ విధంగా సెలవులు ఇచ్చిన తర్వాత కూడా ఖాతాదారులకు పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. పైగా ఈ కాలంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి.
కాబట్టి వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్‌ను కేవలం ఉద్యోగుల సౌకర్యం కోసం చేస్తున్న డిమాండ్‌గా చూడకుండా, మారుతున్న పని విధానాలు, డిజిటల్ బ్యాంకింగ్, ఉద్యోగుల పని భారం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూడాల్సిన అవసరం ఉంది.
