
క్రికెట్లో రాణించాలంటే చదువును పక్కన పెట్టాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ క్రికెట్‌తో పాటు విద్యలోనూ ముందుకు సాగొచ్చని టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ నిరూపిస్తున్నాడు. ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అయ్యర్.. ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేయడమే కాకుండా ప్రస్తుతం పీహెచ్డీ కూడా చేస్తున్నాడు. ఒకప్పుడు రూ.15 లక్షల వార్షిక ప్యాకేజీతో వచ్చిన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని క్రికెట్‌ను ఎంచుకున్న అతడు.. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా సుమారు రూ.55 కోట్లు ఆర్జించినట్లు సమాచారం.
చిన్ననాటి నుంచే చదువు, క్రికెట్‌పై ఆసక్తి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే సమయంలో చదువుకూ సమాన ప్రాధాన్యం ఇచ్చాడు. తొలుత వికెట్ కీపర్, బ్యాటర్‌గా క్రికెట్ కెరీర్ ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా మారాడు. 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన అయ్యర్.. 2018లో రంజీ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు.
రూ.15 లక్షల ఉద్యోగాన్ని వదిలి క్రికెట్ వైపు
క్రికెట్ ఆడుతూనే బీకామ్ పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.. అనంతరం చార్టర్డ్ అకౌంటెన్సీ ఇంటర్ కూడా పూర్తి చేశాడు. అయితే క్రికెట్లో అవకాశాలు పెరగడంతో సీఏ ఫైనల్ పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్‌లో చేరి 2018లో కోర్సు పూర్తి చేశాడు.
ఎంబీఏ పూర్తయిన వెంటనే ప్రముఖ సంస్థ డెలాయిట్‌లో రూ.15 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. అయితే అదే సమయంలో రంజీ క్రికెట్లో అవకాశం రావడంతో కార్పొరేట్ ఉద్యోగం కంటే క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. తన నిర్ణయానికి అప్పటి గర్ల్‌ఫ్రెండ్ శ్రుతి రఘునాథన్ కూడా మద్దతుగా నిలిచినట్లు అయ్యర్ గతంలో వెల్లడించాడు.
ఐపీఎల్.. కెరీర్‌ను మార్చేసిన టర్నింగ్ పాయింట్
2021 ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ అయ్యర్‌ను దక్కించుకుంది. ఆ సీజన్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు.
దీంతో కేకేఆర్ అతడిపై నమ్మకం ఉంచింది. 2022 సీజన్లో రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ.. తర్వాతి సీజన్లలోనూ అదే ధరకు అతడిని కొనసాగించింది. 2024లో అయ్యర్ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో 2025 మెగా వేలంలో కేకేఆర్ ఏకంగా రూ.23.75 కోట్లకు అతడిని తిరిగి సొంతం చేసుకుంది.
ఆర్సీబీలోనూ కీలక ఇన్నింగ్స్‌లు
అయితే 2025 సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కేకేఆర్ అయ్యర్‌ను విడుదల చేసింది. 2026 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.7 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఆ సీజన్లో అందిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్న అయ్యర్ కీలక మ్యాచ్‌ల్లో ప్రభావం చూపించాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన వర్చువల్ నాకౌట్ మ్యాచ్‌లో 40 బంతుల్లో 73 పరుగులు చేసి ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 7 బంతుల్లో 19 పరుగులు, ఫైనల్లో 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
క్రికెట్ తర్వాత కూడా కెరీర్‌పై ఫోకస్
ఐపీఎల్ ద్వారా భారీ మొత్తంలో ఆదాయం ఆర్జించినప్పటికీ వెంకటేశ్ అయ్యర్ చదువును మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎంబీఏ పూర్తయ్యాక పీహెచ్‌డీలో చేరిన అతడు.. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కూడా జీవితంలో మరో దిశగా ముందుకు సాగేందుకు ఈ విద్య ఉపయోగపడుతుందని చెబుతున్నాడు.
క్రికెట్‌తో పాటు ఉన్నత విద్యను కొనసాగిస్తూ.. యువతకు కెరీర్ విషయంలో మరో మార్గాన్ని చూపిస్తున్న వెంకటేశ్ అయ్యర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
