కడప జిల్లా ప్రొద్దుటూరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్జీవన్ మిషన్ను మరోసారి పొడిగించుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వారి ఆవేశం తనకు అర్థమవుతోందని పవన్ అన్నారు. అయితే రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు. యుద్ధం వచ్చినప్పుడే మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని, ప్రత్యర్థి హద్దు మీరితేనే యుద్ధం చేస్తామని వ్యాఖ్యానించారు.
సోమవారం ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి పవన్ కల్యాణ్ ‘జల్జీవన్ మిషన్’, ‘అమరజీవి జలధార’ పథకాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం కీలకంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.