విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆహ్వానించారు. విజయవాడ ఉత్సవ్-2.0కు హాజరై నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని కోరారు.
ఈ మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. విజయవాడ దసరా ఉత్సవాల విశిష్టతను ఆమెకు వివరించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా నవరాత్రి వేడుకల ప్రత్యేకతతో పాటు నగరానికి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని వివరించారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్-2.0ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఉత్సవాల్లో పాల్గొని విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని స్వయంగా వీక్షించాలని వారు ఆత్మీయంగా ఆహ్వానించారు.