
తెలంగాణలో సన్న బియ్యం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం కిలో రూ.45-50గా ఉన్న సన్న బియ్యం ధరలు ప్రస్తుతం రూ.75-85కు చేరాయి. తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ రకాల బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో రాష్ట్రం నుంచి ధాన్యం భారీగా బయటకు తరలిపోతోంది.
మరోవైపు ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లించి సన్న ధాన్యాన్ని సేకరించడం, మిల్లింగ్, రవాణా, ప్యాకింగ్ వంటి ఖర్చులు పెరగడం కూడా బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రానున్న రోజుల్లో దిగుబడులు ఎలా ఉంటాయన్న అంచనాలతో వ్యాపారులు ముందుగానే నిల్వలు పెంచుకుంటుండటం మార్కెట్లో సరఫరాపై ప్రభావం చూపుతోంది.
ధాన్యం లభ్యత తగ్గడం, ఇతర రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, వ్యాపారుల నిల్వలు—ఈ అంశాలన్నీ కలిసి సన్న బియ్యం ధరలు మరింత పెరగడానికి కారణమవుతున్నాయని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలు సామాన్య వినియోగదారుల కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారాన్ని మోపుతున్నాయి.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది సామాన్యుల పరిస్థితి. ఇప్పటికే ఉప్పులు, పప్పులు, వంట నూనెల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. ఇప్పుడు బియ్యం ధరలు మరింత భారంగా మారాయి. ఓపెన్ మార్కెట్లో గత మూడు, నాలుగు నెలల్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి.
కొద్ది నెలల క్రితం వరకు కిలో బియ్యం రూ.45-50 మధ్య లభించగా.. ప్రస్తుతం అదే బియ్యం ధర రూ.75-80 వరకు చేరింది. తెలంగాణలో సన్న రకాల ధాన్యం సాగు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ.. బియ్యం ధరలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.
అయితే బియ్యం ధరలు ఇంత భారీగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధాన్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, పెరిగిన మిల్లింగ్, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు, మార్కెట్లో సరఫరా తగ్గడం వంటి అంశాలతో పాటు వ్యాపారుల నిల్వలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో పండే తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ వంటి నాణ్యమైన సన్న రకాల ధాన్యానికి ఇతర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ నెలకొంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు నేరుగా తెలంగాణలోని నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాలకు చేరుకుని రైతుల నుంచి అధిక ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ఈ ధాన్యాన్ని ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరలిస్తున్నారు. దీంతో తెలంగాణలోని స్థానిక మార్కెట్లలో సన్న ధాన్యం లభ్యత తగ్గి, బియ్యం ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్ ప్రకటించడం, పాఠశాలలు, రేషన్ షాపుల అవసరాల కోసం సన్నబియ్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ప్రైవేట్ మిల్లర్లు, ఓపెన్ మార్కెట్ వ్యాపారులకు అందుబాటులో ఉండే సన్న ధాన్యం పరిమాణం తగ్గుతోంది.
రైతులకు గిట్టుబాటు ధర లభించడం సానుకూల పరిణామమే అయినప్పటికీ, మరోవైపు వినియోగదారులపై ధరల భారం పెరుగుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న ధాన్యం క్వింటాలు ధర సుమారు రూ.3,200 నుంచి రూ.3,300కుపైగా పలుకుతోంది. దీనికి రవాణా, మిల్లింగ్, ప్యాకింగ్, జీఎస్టీ, విద్యుత్ తదితర ఖర్చులు అదనమవుతున్నాయి. ఈ వ్యయాలన్నీ కలిపి చూస్తే, చివరకు వినియోగదారుడికి చేరే సరికి సన్నబియ్యం కిలో ధర రూ.75 నుంచి రూ.85 వరకు చేరుతోంది.
దీంతో ఒకవైపు రైతులకు మెరుగైన ధర లభిస్తుండగా, మరోవైపు స్థానికంగా సన్నబియ్యం లభ్యత తగ్గడం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ఇతర రాష్ట్రాలకు ధాన్యం తరలిపోవడం వంటి కారణాలతో వినియోగదారులకు సన్నబియ్యం మరింత భారంగా మారుతోంది.
