హైదరాబాద్ నగరంలో కొత్త తరహా చోరీలు, మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ముఠాలు సాధారణ ప్రజల్లో కలిసిపోయి, అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మరల్చి నగదు, నగలు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

మహిళా ముఠాల చోరీలు, మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుబజార్లు, వారాంతపు సంతలు, బస్సులు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లలోని రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

అంతేకాకుండా వివాహాలు, శుభకార్యాల్లో బంధువుల మాదిరిగా ప్రవేశించి విలువైన నగలు, నగదును అపహరిస్తున్న ముఠాలపైనా పోలీసులు దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంతో పాటు, రద్దీ ప్రాంతాలు మరియు వేడుకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో మహిళా ముఠాల చోరీలు, మోసాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కూకట్‌పల్లి పరిధిలో మహిళల నుంచి నగదు, నగలు దోచుకున్న ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు ధూల్‌పేట్, బేగంబజార్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరు మహిళలను మంగళ్‌హాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుని ఎత్తుకెళ్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లు, ప్రజా రవాణా కేంద్రాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, మహిళా ముఠాల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మహిళలు ముఠాలుగా ఏర్పడి నగరంలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో నలుగురి నుంచి పది మంది వరకు సభ్యులు ఉంటున్నట్లు తెలుస్తోంది. రైతుబజార్లు, వారసంతలు, షాపింగ్ మాల్స్, సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్, సాధారణ రైళ్లు వంటి రద్దీ ప్రాంతాలను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

రద్దీ సమయాల్లో ప్రయాణికుల్లో కలిసిపోయే ముఠా సభ్యులు.. ఒకరినొకరు నెడుతున్నట్లు, తోసుకుంటున్నట్లు నటిస్తూ చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళల మెడలోని బంగారు గొలుసులు, చేతిసంచుల్లోని నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. బాధితులు విషయం గుర్తించేలోపే ముఠా సభ్యులు అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు.

వారసంతలు, మార్కెట్లలోనూ ఇదే తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారుల రద్దీ, హడావుడిని గమనించి అదను చూసి నగదు, విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులు నేరానికి పాల్పడుతుండగా.. మిగిలిన వారు పరిసరాలను గమనిస్తూ పోలీసుల కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో చోరీ జరిగిన విషయం బాధితులకు తెలిసేలోపే నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.

ఇక బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద వృద్ధులను లక్ష్యంగా చేసుకునే ముఠాలు కూడా నగరంలో చురుగ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా మహిళా సభ్యులు వృద్ధులతో మాటలు కలిపి వారిని ఏమార్చుతారు. అనంతరం భయాందోళనకు గురిచేసి వారి వద్ద ఉన్న సంచులు, నగదును లాక్కుని అక్కడి నుంచి పరారవుతున్నారు.

మరోవైపు పాత బంగారం, తవ్వకాల్లో లభించిన బంగారం, విదేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారు బిస్కెట్లంటూ తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాల్లో మహిళలు, పురుషులు కలిసి పనిచేస్తూ వ్యాపారులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.