ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవిలో వరుసగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చంద్రబాబు తన 48 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో ప్రభుత్వాలు మారడం, ఆర్థిక వ్యవస్థలు రూపాంతరం చెందడం, సాంకేతికత ప్రపంచాన్ని ప్రభావితం చేయడం, నాయకులు ఎదగడం, పడిపోవడం చూశానన్నారు.
అయితే కాలంతో పాటు ఒక విషయం మరింత స్పష్టమైందని, అదే నాయకత్వం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా, ప్రభుత్వ సేవా ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ స్పష్టమైన దూరదృష్టి, నిజాయతీ, క్రమశిక్షణ, ప్రతి అంశంపై శ్రద్ధ, ముఖ్యంగా ప్రణాళికలను సమర్థంగా అమలు చేసే సామర్థ్యం ఆయన నాయకత్వానికి ప్రత్యేకతలని చంద్రబాబు కొనియాడారు.
మహమ్మారి, యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాల మధ్య కూడా భారత్ స్థిరమైన పురోగతిని సాధించిందని అన్నారు. అపూర్వ వేగంతో మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు బలోపేతం, సాంకేతికతకు ప్రాధాన్యం, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో దేశం ముందడుగు వేసిందని పేర్కొన్నారు.
అదే సమయంలో ప్రపంచ వేదికపై భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. ఒక తరాన్ని తీర్చిదిద్దే అవకాశం కొద్దిమంది నాయకులకు మాత్రమే లభిస్తుందని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావడం మరింత అరుదైన అవకాశమని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల నాయకత్వం, ఈ కాలంలో భారత్లో చోటుచేసుకున్న మార్పులపై ఓ ఆంగ్ల పత్రికలో తన అభిప్రాయ వ్యాసాన్ని రాయడం ఎంతో సంతోషంగా ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.