• నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రం వీఐపీ బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
  • ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలతో పాటు చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలను కూడా 10 రోజుల పాటు రద్దు చేసింది. NRI, డిఫెన్స్ దర్శనాలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
  • ఇదిలా ఉండగా శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు తెలిపింది.
  • మరోవైపు తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు, జిల్లా రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఆటోలు, సుమోలు, జీపులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రయాణికుల మాదిరిగా మారువేషాల్లో వెళ్లిన అధికారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాహనాలను గుర్తించారు.
  • తనిఖీల్లో 13 ఆటోలు, 3 సుమోలు, 2 జీపులు కలిపి మొత్తం 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మొత్తం రూ.లక్ష జరిమానా విధించారు. అధిక ఛార్జీలు వసూలు చేయడం ఓవర్‌లోడింగ్, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు లేకపోవడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

By Rajini