సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రేపల్లెలో ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.58.42 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 66 కొత్త పోస్టులను మంజూరు చేయడానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకానికి రాటిఫికేషన్‌ ఇచ్చారు. అలాగే విశాఖపట్నంలోని మరికవలసలో గిరిజన విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్‌ కోచింగ్‌ అందించేందుకు ప్రత్యేకంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది.

విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్‌ యూనివర్సిటీలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే నూతన పాలసీ-2026కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనితో పాటు భూముల బదలాయింపులు, ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ వంటి పలు ప్రతిపాదనలకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యానవన రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మొత్తం 12 అజెండా అంశాలపై కేబినెట్‌ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. సమావేశ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ.58.42 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపింది. ఆస్పత్రి నిర్వహణ కోసం అదనంగా 66 పోస్టులను మంజూరు చేయడానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రాష్ట్ర ఉద్యానవన రంగానికి సంబంధించిన సమాచారాన్ని సమర్థంగా నిర్వహించేందుకు హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏపీహెచ్‌ఐఎంఎస్‌) ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.20.62 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును 72 నెలల పాటు అమలు చేయనున్నారు.

ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం రాటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పథకం పరిధిలోకి అదనంగా 58,060 మంది లబ్ధిదారులను చేర్చడంతో మొత్తం 68,57,880 మందికి ప్రయోజనం కలగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు.

సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డైట్‌ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నంలోని మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది.

ఈ కేంద్రంలో ఐఐటీ-జేఈఈ, నీట్‌ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అందించనున్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇక విద్యా వ్యవస్థలో కాలానుగుణంగా మార్పులు తీసుకురావడంలో భాగంగా ఏపీ విద్యా చట్టం-1982లో సవరణలు చేసే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యార్థుల సిలబస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్పులు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.