
విజయనగరం జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి జనసేనలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ ప్రచారంపై కొలగట్ల వీరభద్ర స్వామి స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా తాను విజయనగరంలో లేనని, ఇదే సమయంలో తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు
విజయనగరం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు పలువురు జెడ్పీటీసీలు, గ్రామస్థాయి నేతలు కూడా వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మజ్జి శ్రీను వియ్యంకుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ వేటు వేయడం మరింత రాజకీయ వేడి పెంచింది.
ఇలాంటి పరిణామాల మధ్య విజయనగరం జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీని వీడి జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. దీంతో జిల్లాలో మరో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకోబోతోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ మార్పు ప్రచారంపై కొలగట్ల వీరభద్రస్వామి క్లారిటీ
విజయనగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కొలగట్ల వీరభద్రస్వామి జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆయన వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, జనసేన నేతలతో పార్టీ మార్పుపై చర్చలు జరుపుతున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.
అయితే ఈ ప్రచారంపై కొలగట్ల వీరభద్రస్వామి స్పందించి స్పష్టత ఇచ్చారు. తాను వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
గత వారం రోజులుగా తాను విజయనగరంలో లేనని, కుటుంబంతో కలిసి విశాఖపట్నంలోని తన ఇంట్లో ఉంటున్నానని వీరభద్రస్వామి తెలిపారు. విజయనగరంలోని తన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ వైర్లు కాలిపోయాయని, ఇంట్లో వైరింగ్ పనులు చేయాల్సి రావడంతో విశాఖపట్నంలో ఉంటున్నట్లు వివరించారు.
తాను విజయనగరంలో లేకపోవడాన్ని కొందరు పార్టీ మార్పుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జనసేనలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను కొలగట్ల వీరభద్రస్వామి ఖండించారు.
అశోక్‌గజపతిరాజును తాను కలిసేందుకు ప్రయత్నించారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వీరభద్రస్వామి స్పష్టం చేశారు. తన వయసు 65 ఏళ్లని, ఇక ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. మేయర్ పదవి కోసం పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇతర పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందా? అని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వీరభద్రస్వామి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశానికీ తాను స్పందించలేనని స్పష్టం చేశారు. తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తల భవిష్యత్తే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని వీరభద్రస్వామి పిలుపునిచ్చారు.
