తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను విజయవాడ దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఆహ్వానంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

విజయవాడకు సీఎం విజయ్ రానున్నారా? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయవాడలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

విజయ్‌కు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, హరీష్ బాలయోగితో పాటు విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి ఇటీవల విజయ్‌ను కలిసి ఏపీ ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై విజయ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వచ్చే వారంలో ప్రారంభం కానున్న ఉత్సవాల్లో ఆయన ఒకరోజు పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

దుర్గమ్మ దర్శనం చేసుకుంటారా?

విజయ్ విజయవాడకు వస్తే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే ఆయన పర్యటనపై తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీలోనూ విజయ్‌కు ఫాలోయింగ్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం సాధించి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయ్ సినిమాలకు కూడా ఏపీలో మంచి అభిమాన వర్గం ఉంది.

ఇటీవల తమిళనాడు ప్రభుత్వ పథకాల ప్రకటనలు తెలుగు మీడియాకు ఇవ్వడంతో, టీవీకే పార్టీని ఏపీలో విస్తరించే ఆలోచనలో విజయ్ ఉన్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *