ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఏపీ హైకోర్టు నిర్దేశించిన ఆరు వారాల గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తయితే, సవరించిన సమగ్ర ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఒకవేళ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాకపోతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
వార్డుల పునర్విభజనపై వైసీపీ పిటిషన్ కొట్టివేత
వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్యూమరేటర్లకు, కేంద్ర ప్రభుత్వానికి లేని ఇబ్బంది వైసీపీకి ఎందుకని ప్రశ్నించింది.
స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించాలనే ప్రయత్నం పిటిషన్లో కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికల నిర్వహణలో జాప్యం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంటూ, ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగేలా కీలక ఆదేశాలు జారీ చేసింది.