
తమిళనాడులోని ధారాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీవీకే విజయం సాధించడంతో ఆ పార్టీ బలం 109కి చేరింది. రెండు స్థానాల్లో గెలిచిన సీఎం విజయ్.. తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన డీఎంకే అభ్యర్థి ఫలితాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో తిరుచిరాపల్లి ఈస్ట్ ఉపఎన్నికపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ స్టే కారణంగా మరో నాలుగు స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహించలేకపోయారు
తమిళనాడులో అక్టోబర్ 6న జరిగిన ధారాపురం, మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార టీవీకే ఘన విజయం సాధించింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరగథం కుమారవేల్, సత్యభామ తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేసి విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. మధురాంతకం నియోజకవర్గంలో మొదటి నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన టీవీకే.. ధారాపురంలో మాత్రం తొలుత వెనుకబడింది. అయినప్పటికీ, చివరికి రెండు స్థానాల్లోనూ విజయం సాధించి సత్తా చాటింది. ఈ విజయంతో తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 107 నుంచి 109కి పెరగనుంది
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 238 స్థానాలు ఉండగా, ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించిన విజయ్.. ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేకపోవడంతో ఆయనకు తొలి నుంచే రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కోసం విజయ్ పలుమార్లు గవర్నర్‌ను కలవాల్సి వచ్చింది. చివరకు ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌తో పాటు ఐయూఎంఎల్ (2), వీసీకే (2), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో విజయ్‌కు రాజకీయ సమీకరణాలపై స్పష్టత వచ్చింది. ఒక దశలో అన్నాడీఎంకే, డీఎంకే చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ప్రచారం కూడా సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం అయిన తర్వాత విజయ్.. అసెంబ్లీలో టీవీకే బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరారు. తొలుత మధురాంతకం ఎమ్మెల్యే మరగథం కుమారవేల్, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామ విజయ్ పార్టీలో చేరడంతో ఆ రెండు స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఐదు స్థానాలకు ఉపఎన్నికలు పెండింగ్!
అన్నాడీఎంకేకు చెందిన పెరుందురై, అంబసముద్రం, విరాలిమలై, కరూర్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. మరోవైపు, పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన విజయ్.. ఇప్పటికే తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ఓటమిపాలైన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఐదు స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ స్టే తొలగిన తర్వాతే ఆయా స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఈ ఐదు స్థానాల్లోనూ విజయం సాధిస్తే అసెంబ్లీలో టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 114కి చేరుతుంది. తద్వారా ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ మార్కుకు కేవలం నాలుగు సీట్ల దూరంలో నిలుస్తుంది. ఈలోగా మరో నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరితే, తదుపరి ఉపఎన్నికల్లోనూ విజయం సాధించడం ద్వారా విజయ్ తన పార్టీ బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే, ప్రభుత్వ మనుగడ కోసం మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విజయ్ ప్రభుత్వం మరింత స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉండటంతో పాటు, ఇతర పార్టీల నుంచి టీవీకేలోకి వలసలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
