ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా ఆయనకు అందించిన 18 రకాల ప్రత్యేక బహుమతులకు పీఎం మెమెంటోస్ కలెక్షన్‌లో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవం, చేతివృత్తుల ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ బహుమతులను రూపొందించారు. ప్రస్తుతం వీటిని వేలానికి ఉంచారు. ఈ బహుమతుల్లో కొండపల్లి చెక్కతో తయారు చేసిన ఎద్దుల బండి, ప్రధాని మోదీ ఫొటోతో కూడిన కలంకారీ వస్త్రం, శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అందించిన స్మారక చిహ్నం వంటి ప్రత్యేక వస్తువులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రానికి చెందిన ప్రత్యేక బహుమతులను అందించారు. ఇలా వివిధ సందర్భాల్లో ప్రధానికి అందించిన 18 బహుమతులను తాజాగా వేలానికి ఉంచారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించనున్నారు. ప్రధానికి అందించిన బహుమతులను ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ పర్యటనల సందర్భంగా అందించిన బహుమతుల్లో ప్రధానమంత్రి ఫొటోతో కూడిన కలంకారీ వస్త్రం, శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం అందించిన జ్ఞాపికలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే కళారూపాలు, కొండపల్లి చెక్కతో రూపొందించిన ఎద్దులబండి బొమ్మ వంటి ప్రత్యేక వస్తువులు ఉన్నాయి. ఈ బహుమతుల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ కార్యక్రమానికి అందించాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ బహుమతుల ఈ-వేలం అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. ఆసక్తి ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://pmmementos.gov.in  ద్వారా బిడ్లు దాఖలు చేసి తమకు నచ్చిన జ్ఞాపికలను సొంతం చేసుకోవచ్చని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రధానికి ఏపీ పర్యటనలో అందించిన కానుకలతో పాటు, దేశవిదేశాల పర్యటనలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయనకు లభించిన బహుమతులు, జ్ఞాపికలను కూడా ఈ వేలంలో విక్రయానికి ఉంచారు. పీఎం మెమెంటోస్ ఎనిమిదో విడత ఈ-వేలం గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఈ విడతలో మొత్తం 30 రకాల ప్రత్యేక కానుకలు, జ్ఞాపికలు ఆన్‌లైన్ వేలానికి అందుబాటులో ఉన్నాయి.

వీటిలో కాకతీయ కళాతోరణం వెండి నమూనాకు రూ.10 లక్షలు, జగన్నాథ పరివార రథం ప్రతిమకు రూ.21 లక్షలు, కర్ణాటకకు చెందిన శ్రీరాముడి వెండి విగ్రహానికి రూ.13.50 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించారు. వీటితో పాటు వివిధ ఆలయాలు, చారిత్రక ప్రదేశాల నమూనాలు, సంప్రదాయ చేతివృత్తుల కళారూపాలు, చిత్రాలు, పెయింటింగులు, విగ్రహాలు, శాలువాలు తదితర వస్తువులు వేలంలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు, వేలం ద్వారా వచ్చిన నిధులను సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *