
థియేటర్లలో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతూ ‘కామ్రేడ్ కళ్యాణ్’ మంచి ఆదరణ అందుకుంటోందని హీరో శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబ ప్రేక్షకులంతా కలిసి సినిమాను ఆస్వాదిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో చిత్రబృందం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.
D News: ‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయంపై శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను లవ్ కామెడీ సినిమాలు చేశానని, తొలిసారి మాస్ కామెడీ జానర్‌ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ తరహా కథను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని మొదట కొంత ఆలోచించానని, అయితే థియేటర్లలో వస్తున్న స్పందన తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. సినిమా చూస్తూ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకోవడం సంతృప్తినిస్తోందన్నారు. దసరా పండుగకు కుటుంబమంతా కలిసి చూసి ఆనందించే చిత్రంగా ఇది నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
మరోసారి సక్సెస్ సెంటిమెంట్ రిపీట్!
చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ కూడా సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’లోని కళ్యాణ్ పాత్ర ప్రేక్షకులకు చేరువైందని, కామెడీతో అందరినీ అలరిస్తోందని అన్నారు. తాను ఏ హీరోతో కలిసి తొలిసారి సినిమా చేసినా విజయం సాధిస్తోందని, ఈ చిత్రంతో మరోసారి అదే సెంటిమెంట్ పునరావృతం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
విజయోత్సవ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడు పాల్గొన్నారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ చిత్రబృందంలో ఉత్సాహాన్ని నింపుతోంది. కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
