హీరో నితిన్ కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణీ’పై టాలీవుడ్‌లో ఆసక్తి పెరుగుతోంది. ‘భీష్మ’ తర్వాత సరైన విజయాన్ని అందుకోవాలని చూస్తున్న నితిన్.. ఈసారి మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రుక్మిణిగా ఆఫియా సయ్యద్?

ఈ సినిమాలో రుక్మిణి పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయంపై మొదటినుంచీ చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ నితిన్‌కు జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలా మేనకోడలిగా గుర్తింపు పొందారు. ‘ప్రేమ్ కీటాను’ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆఫియా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు సమాచారం.

అక్టోబర్ 13న కీలక అప్‌డేట్

రుక్మిణి పాత్రకు సంబంధించిన వివరాలను అక్టోబర్ 13న వెల్లడించనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అదే రోజు ఆఫియా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డిసెంబర్ 4న థియేటర్లలోకి..

ఈ సినిమాలో నితిన్ ‘కృష్ణ’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కథపై ఆసక్తిని పెంచింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రం నితిన్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *