
2026 చివరి రెండు నెలలు టాలీవుడ్లో సినిమాల సందడిని మరింత పెంచనున్నాయి. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. యువ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ కనిపించనుంది. ముఖ్యంగా డిసెంబర్ 4న మూడు సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నవంబర్‌లో వరుసగా సినిమాలు
నవంబర్ 12న శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఉన్నాయి.
ఆ తర్వాత నవంబర్ 19న విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ విడుదల కానున్నట్లు సమాచారం. యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తొలి భాగానికి కొనసాగింపుగా ఈ సినిమా వస్తుండటంతో సీక్వెల్‌పై ఆసక్తి నెలకొంది. ఇక నవంబర్ 20న దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ థియేటర్లలోకి రానుంది. వరుస తేదీల్లో సినిమాలు విడుదలవుతుండటంతో నవంబర్ నెల కూడా బిజీగా మారనుంది.
డిసెంబర్ 4న ట్రిపుల్ క్లాష్?
డిసెంబర్ మొదటి వారంలో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 4న నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’, నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’, విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లెగసీ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నాని నిర్మాణ సంస్థ సమర్పణలో రూపొందుతున్న ‘అలియాస్ రుక్మిణీ’పై ఇప్పటికే చర్చ జరుగుతోంది. మరోవైపు నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’, విశ్వక్ సేన్ ‘లెగసీ’ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూడు సినిమాలు నిజంగానే ఒకే తేదీన విడుదలైతే థియేటర్లలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే విడుదల తేదీల్లో మార్పులు ఉంటాయా లేదా అన్నది అధికారిక ప్రకటనలతోనే స్పష్టమవుతుంది.
చివరి రెండు నెలల్లో విజేతలెవరు?
సినిమాల విడుదల తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్లు, ట్రైలర్లు, పాటలు ప్రేక్షకుల అంచనాలను ప్రభావితం చేయనున్నాయి. కథ, నటన, ప్రేక్షకుల స్పందన, వసూళ్లు.. ఇలా పలు అంశాలు బాక్సాఫీస్ ఫలితాలను నిర్ణయించనున్నాయి. మరి ఈ ఏడాది చివర్లో ఏ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి? ఏ హీరోలు విజయాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
