
వాహనాల్లో గంజాయి తరలిస్తే పోలీసులకు పట్టుబడుతున్నారనే భయంతో ఓ వ్యక్తి కొత్త పంథాను ఎంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను పొట్ట చుట్టూ కట్టుకుని బస్సులో ప్రయాణించాడు. అయితే, అతని షర్ట్ నుంచి టేప్ బయటకు కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతని షర్ట్‌ను తనిఖీ చేయగా గంజాయి తరలిస్తున్న విషయం బయటపడింది. ఈ ఘటనలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన తమిళనాడుకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
సినిమాల ప్రభావంతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారో.. లేక స్మగ్లర్ల ఆలోచనలే సినిమాల్లో కనిపిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తున్నప్పటికీ కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు వాహనాల్లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తుండగా, మరికొందరు నిత్యావసర సరుకుల మాటున అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా గంజాయి ప్యాకెట్లను పొట్ట చుట్టూ కట్టుకుని ఆర్టీసీ బస్సులో తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని వేషం ఎక్కువసేపు కొనసాగలేదు. షర్ట్ నుంచి టేప్ బయటకు కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి అతని గంజాయి అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన జయశీలన్ (43) ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఒడిశా సరిహద్దుల్లో ఓ వ్యక్తి నుంచి కిలో రూ.6 వేల చొప్పున మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అయితే, దాన్ని తమిళనాడుకు తరలించేందుకు వాహనాలను ఉపయోగిస్తే పోలీసులకు చిక్కే అవకాశం ఉందని భావించి, వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు.
మూడు కిలోల గంజాయిని పలుచటి సంచుల్లో ప్యాక్ చేసి, వాటిని పొట్ట చుట్టూ కట్టుకున్నాడు. అనంతరం ప్లాస్టిక్ టేపులతో గట్టిగా అతికించి, బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో చూసేవారికి అతనికి పెద్ద పొట్ట ఉన్నట్లే కనిపించేది. ఎలాంటి అనుమానం రాకుండా గంజాయిని తరలించవచ్చని భావించాడు.
ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ప్రయాణించాడు. అయితే, బస్సు దిగే సమయంలో అతని షర్టు కింద నుంచి ప్లాస్టిక్ టేప్ వేలాడుతుండటాన్ని కొందరు గమనించారు. దీంతో అనుమానం వచ్చిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
