• నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హృదయాలను హత్తుకునే పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతులతో ఏడుకొండలు కొత్త శోభను సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన అలంకరణల్లో టీటీడీ అధికారులు స్వల్ప మార్పులు, చేర్పులు చేశారు. జీఎన్‌సీ టోల్‌గేట్‌ నుంచి శ్రీవారి ఆలయ సన్నిధి వరకు చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

12 టన్నుల పుష్పాలతో ఆలయానికి దివ్య శోభ

  • వివిధ రంగులు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో తిరుమల క్షేత్రాన్ని అలంకరిస్తున్నారు. శ్రీవారి ఆలయం లోపల అలంకరణలకు ఆరు టన్నులు, ఆలయం వెలుపల మరో ఆరు టన్నుల పుష్పాలను వినియోగిస్తున్నారు. వీటికి అదనంగా దాదాపు లక్ష కట్‌ఫ్లవర్స్‌తో ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ఆదివారం సాయంత్రంలోగా అలంకరించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు రంగురంగుల విద్యుత్‌ దీపాలతో స్వామివారి కొండ కళకళలాడుతోంది. శనివారం సాయంత్రం విద్యుత్‌ అలంకరణల పనితీరును పరిశీలించిన అధికారులు, అవసరమైన చోట్ల స్వల్ప మార్పులు చేశారు.

ఘాట్‌రోడ్లు, కాలినడక మార్గాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ పరీక్ష

  • తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సెల్‌ఫోన్‌ కనెక్టివిటీ అందించడంపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ ప్రాంతం కావడంతో ఘాట్‌రోడ్లు, కాలినడక మార్గాల్లో ప్రయాణించే భక్తులకు తరచూ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివిధ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించిన అధికారులు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
  • తిరుమల మొదటి, రెండో ఘాట్‌రోడ్లతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో కలిపి దాదాపు ఏడు ప్రాంతాల్లో కొత్త సెల్‌ఫోన్‌ టవర్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన సిగ్నల్‌ పరికరాల అమరిక పూర్తవడంతో శనివారం ఘాట్‌రోడ్లు, కాలినడక మార్గాల్లో సిగ్నల్స్‌ పనితీరును పరీక్షించారు.
  • ఈ సందర్భంగా గుర్తించిన లోటుపాట్లను నమోదు చేసుకున్నారు. వాటిని మరో వారం నుంచి పది రోజుల్లో సరిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకవైపు పుష్ప, విద్యుత్‌ అలంకరణలతో తిరుమలకు దివ్య శోభ తీసుకొస్తూనే, మరోవైపు భక్తుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *