
మెదక్ జిల్లాలో అరుదైన చారిత్రక శిల్పం వెలుగుచూసింది. కుల్చారం మండలం యనగండ్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం సమీపంలో తొమ్మిదో శతాబ్దానికి చెందిన గజలక్ష్మి శిల్పాన్ని గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ నల్లరాతి శిల్పం పురావస్తు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ శిల్పంలో లక్ష్మీదేవికి ఏనుగులు అభిషేకం చేస్తున్న దృశ్యంతో పాటు సముద్ర మథనానికి సంబంధించిన చిత్రాలను అద్భుతంగా చెక్కారు. శిల్పం వెనుకవైపు పన్నెండు చేతులతో ఉన్న శివనటరాజు రూపంతో పాటు బ్రహ్మ, విష్ణువుల ప్రతిమలను కూడా రూపొందించారు. పురావస్తు నిపుణులు ఈ శిల్పాన్ని పరిశీలించి, దాని చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించారు.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పురాతన శిల్పాన్ని భద్రపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు. శిల్పాన్ని పీఠంపై ఏర్పాటు చేసి, భవిష్యత్ తరాలకు అందించేలా తగిన పరిరక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అరుదైన శిల్పం వెలుగులోకి రావడంతో యనగండ్ల గ్రామ చారిత్రక ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ చరిత్ర, శిల్పకళా వైభవానికి అద్దం పట్టే అరుదైన పురాతన శిల్పం మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. కుల్చారం మండలం యనగండ్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం సమీపంలో చెట్టు కింద నిర్లక్ష్యంగా పడి ఉన్న తొమ్మిదో శతాబ్దానికి చెందిన గజలక్ష్మి శిల్పాన్ని చరిత్ర పరిశోధకులు గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ శిల్పం తన ప్రత్యేక కళాత్మక రూపాలతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నివేదించని అరుదైన సముద్ర మథనం దృశ్యం ఇందులో ఉండటం విశేషంగా నిలిచింది. ఈ శిల్పం వెలుగులోకి రావడంతో తెలంగాణలోని ప్రాచీన శిల్ప సంపద, చారిత్రక వారసత్వంపై మరోసారి ఆసక్తి నెలకొంది
కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన బుర్ర సంతోష్ అందించిన సమాచారంతో సీనియర్ పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి, కేటీసీబీ కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, వారసత్వ పరిరక్షణ కార్యకర్తలు గొట్టిపాటి శ్రీనివాసరావు, ప్రొఫెసర్ ఏ. రఘు యనగండ్ల గ్రామాన్ని సందర్శించారు. అక్కడ లభించిన పురాతన శిల్పాన్ని పరిశీలించి, దాని చారిత్రక, కళాత్మక విశిష్టతలను వివరించారు.
నల్ల గ్రానైట్ రాతితో రూపొందించిన ఈ శిల్పంలో లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని, రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉన్నారు. దేవతకు ఇరువైపులా ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా చెక్కారు. ఈ సంప్రదాయ రూపాన్నే గజలక్ష్మిగా పిలుస్తారు. అయితే, ఈ శిల్పం పైభాగంలో సముద్ర మథనం ఘట్టాన్ని కూడా చిత్రించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పురాణాల ప్రకారం.. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మథించిన సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఈ పురాణ ఘట్టాన్ని గజలక్ష్మి రూపంతో కలిపి చెక్కడం శిల్పంలోని ప్రత్యేకతను మరింత పెంచుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.
శిల్పం వెనుకవైపు పన్నెండు చేతులతో ఆనంద తాండవం చేస్తున్న శివనటరాజు రూపాన్ని మలిచారు. ఆయనకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణువులను కూర్చున్న భంగిమలో చెక్కారు. ఒకే శిల్పానికి ముందు భాగంలో గజలక్ష్మి, సముద్ర మథనం దృశ్యాలను, వెనుక భాగంలో శివనటరాజు, బ్రహ్మ, విష్ణువుల రూపాలను రూపొందించడం అప్పటి శిల్పకారుల అసాధారణ నైపుణ్యానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ లక్షణాల ఆధారంగా దీన్ని రాష్ట్రకూటుల కాలానికి చెందిన విశిష్ట కళాఖండంగా వారు పేర్కొన్నారు
డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. యనగండ్ల గ్రామంలో గుర్తించిన గజలక్ష్మి శిల్పంలోని సముద్ర మథనం దృశ్యం దానికి ప్రత్యేక గుర్తింపునిస్తోందని తెలిపారు. ఇలాంటి శిల్పాలను సాధారణంగా ఆలయాల తోరణాలపై అలంకారంగా ఏర్పాటు చేసేవారని వివరించారు. ప్రస్తుతం శిథిలమై ఆనవాళ్లు కోల్పోయిన ఏదైనా పురాతన ఆలయ ప్రవేశ ద్వారానికి ఈ శిల్పం అలంకారంగా ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ శిల్పాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకుండా, తగిన పీఠంపై ఏర్పాటు చేసి భద్రపరచాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. పురాతన శిల్పాలు, చారిత్రక అవశేషాలను సంరక్షించడం ద్వారా ప్రాంతీయ చరిత్రను, ప్రాచీన కళా వైభవాన్ని భావితరాలకు అందించవచ్చని వారసత్వ పరిరక్షణ కార్యకర్తలు సూచించారు.
