
హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ భూమి మార్కెట్ విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సర్వే నంబర్ 41/14లో ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ రాత్రికి రాత్రే బ్లూషీట్లు ఏర్పాటు చేసి, ఇనుప కంచెలతో ప్రహరీ నిర్మించినట్లు సమాచారం. గతంలో ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయగా, సంబంధిత సంస్థ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమి యాజమాన్య హక్కులు, సరిహద్దులు, ఆక్రమణ ఆరోపణలపై రెవెన్యూ రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్ సమీపంలోని ఖానామెట్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు రెండు ఎకరాల స్థలం చుట్టూ రాత్రికి రాత్రే బ్లూషీట్లు ఏర్పాటు చేసి, ఇనుప కంచెలతో ప్రహరీ నిర్మించినట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ భూమి మార్కెట్ విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గతంలో ఇదే స్థలంలో నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకున్న అధికారులు సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, తాజాగా మరోసారి ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు వస్తున్న సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. భూమి హక్కులు, సరిహద్దులు, ఆక్రమణ ఆరోపణలపై అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 41లో ఒకప్పుడు మొత్తం 252 ఎకరాల భూమి ఉండేది. తొలుత ఈ భూమిని పోరంబోకు భూమిగా నమోదు చేశారు. 1962లో ఇందులో 47 ఎకరాలను 13 మంది రైతులకు సాగు కోసం ప్రభుత్వం కేటాయించి, ఎసైన్మెంట్ పట్టాలు జారీ చేసింది. ఈ భూములను 41/1 నుంచి 41/13 వరకు సర్వే నంబర్లుగా విభజించి, రైతుల పేర్లపై నమోదు చేశారు. మిగిలిన భూమిని 41/14 సర్వే నంబరుతో ప్రభుత్వ భూమిగా ఉంచారు. ఆ ప్రాంతంలో రాళ్లు, గుట్టలు అధికంగా ఉండటంతో కొంతకాలం పాటు భూములు నిరుపయోగంగా, ఖాళీగానే ఉండిపోయాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఖానామెట్ పరిసరాల్లోని కొన్ని భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ఏపీఐఐసీ వంటి సంస్థలకు రెవెన్యూ శాఖ అప్పగించింది. వీటిలో కొంతభూమిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి విక్రయించగా, వివాదాలు, ఇతర కారణాలతో మరికొన్ని భూములు తిరిగి రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఈ ప్రాంతంలోని సుమారు 43 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించారు. అయితే, కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో ఆయా స్థలాల్లో కొంతభాగం ఇప్పటికీ ఖాళీగానే మిగిలిపోయింది.
1962లో రైతులకు కేటాయించిన భూములకు ఆ తర్వాతి కాలంలో సేత్వారీ పట్టాలు జారీ అయ్యాయి. 2004 నుంచి ఈ భూముల్లో వివిధ క్రయవిక్రయాలు జరగడంతో కొన్ని ప్రాంతాల్లో యాజమాన్య హక్కులపై వివాదాలు తలెత్తినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పట్టా భూములకు ఆనుకుని ఉన్న 41/14 సర్వే నంబరులోని ప్రభుత్వ స్థలంపైనా కొందరు కన్నేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక సర్వే నంబరుకు సంబంధించిన పట్టా పత్రాలను ఆధారంగా చూపుతూ, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది.
సర్వే నంబర్ 41/13/ఏలో తమకు 5,421 చదరపు గజాల స్థలం ఉందని ఓ సంస్థ వాదిస్తోంది. అయితే, ఆ భూమిపై హక్కులను నిర్ధారించేందుకు సంబంధిత పట్టా పత్రాలతో పాటు లింక్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంస్థ పేర్కొంటున్న పట్టా భూమి ఒకచోట ఉండగా, తాజాగా ప్రహరీ నిర్మించిన స్థలం మాత్రం 41/14 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిగా ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అసలు భూమి హద్దులు, యాజమాన్య హక్కులపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది.
